
చెన్నైలో భారీ వర్షాలు –రైల్వే సేవలు నిలిపివేత
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై, నాగపట్నంలో వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం అక్టోబర్ 22 వరకు చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి తమిళనాడు తీర ప్రాంతమంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, దిండిగల్, తేనీ, మదురై, విరంబూనగర్, రామనాథపురం, శివగంగా, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మయిలాదుతురై, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకాళ్ ప్రాంతాలకు వర్ష హెచ్చరికలు జారీచేశారు. తూత్తుకుడిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయిప్పటికి వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా సాగాయి.
చెన్నైకు ‘యెల్లో అలర్ట్’ జారీ
చెన్నైలో వాతావరణ శాఖ మోస్తరు వర్షం నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన వర్షాలు కురుస్తున్నాయన్నారు.
నీలగిరికి రైల్వే సేవలు రద్దు
భారీ వర్షాల కారణంగా నీలగిరి పర్వత రైల్వే మార్గంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు. కల్లార్–కూనూర్ మార్గంలో బండరాళ్లు, చెట్లు, మట్టి కూలిపోవడంతో ట్రాక్ మూసుకుపోయిందని సదరన్ రైల్వే వెల్లడించింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. రద్దైన రైళ్లు: 56136 మెట్టుపాళయం–ఉదగమండలం, 56137 ఉదగమండలం– మెట్టుపాళయం, 06171 మెట్టుపాళయం–ఉదగమండలం స్పెషల్ ఉన్నాయి.
మత్స్యకారులకు హెచ్చరికలు
కడలూరు జిల్లా మత్స్యశాఖ అధికారులు జారీ చేసిన ప్రకటన ప్రకారం, అన్ని రకాల మెకనైజ్డ్ బోట్లు, కాటమరాన్లు, మోటార్ పడవలు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి చేరుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించాలని, మత్స్యకారులు పూర్తిగా సహకారించాలని అధికారుల విజ్ఞప్తి చేశారు.