
చెన్నూరులో 'ఏటీసీ' భవనానికి భూమిపూజ చేసిన మంత్రులు జూపల్లి, వివేక్
చెన్నూరు పట్టణ కేంద్రంలో రూ.47.11 లక్షల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు సహచర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, యువతకు చదువుతో పాటు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో ఈ ఏటీసీల్లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులు, ట్రేడ్లు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమన్నారు. వెనుకబడిన చెన్నూరు ప్రాంత యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక కృషితో ఈ ఏటీసీని ఏర్పాటు చేస్తున్నారని ప్రశంసించారు.
యువత తమ కాళ్లపై తాము నిలబడేలా, ఉపాధి అవకాశాలు పెంపొందించేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నైపుణ్యాభివృద్ధే మార్గమని పేర్కొన్నారు. అందుకే చదువు పూర్తి చేసిన యువతతో పాటు మధ్యలో చదువు మానేసిన వారికి కూడా ఉపాధి కలిగేలా ఈ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
చెన్నూరులో ఇప్పటికే రూ.50 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. త్వరలోనే మరో రూ.50 కోట్ల విలువైన ప్రగతి పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల పురోగతికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు అందించి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి చెప్పారు. యువత భవిష్యత్తు బలపడితే రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అడుగు యువత సాధికారతకే అంకితమని ఆయన పేర్కొన్నారు.
