Let's talk: editor@tmv.in
చిన్నారుల కోసం 21 కొత్త పోషకాహార పునరావాస కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

చిన్నారుల కోసం 21 కొత్త పోషకాహార పునరావాస కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు (ఎన్‌ఆర్‌సీలు) ఏర్పాటు కాబోతున్నాయని, వీటి ద్వారా అదనంగా 175 పడకలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీల సంఖ్య 21 నుంచి 42కు, మొత్తం పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతుంది.

కేంద్రాల ఏర్పాటు వివరాలు

ఇప్పటికే మంజూరైన ఎనిమిది 10 పడకల ఎన్‌ఆర్‌సీలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, ముంచింగిపుట్‌, చింతపల్లి, అనకాపల్లి, బాపట్ల, నంద్యాల, సున్నిపెంటతో పాటు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 80 పడకలు అందుబాటులోకి వస్తాయి. అరకు, నంద్యాల కేంద్రాల పనులు పూర్తికాగా, త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి. ముంచింగిపుట్‌లో సివిల్‌ పనులకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, చింతపల్లిలో కొత్త భవనం నిర్మాణంలో ఉంది. అనకాపల్లిలో పనులు జరుగుతున్నాయి.

గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు సేవలు అందించేందుకు మరో ఏడు, ఐదు పడకల ఇంటిగ్రేటెడ్‌ ఎన్‌ఆర్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. అడ్డతీగల, వై.రామవరం, సాలూరు, పాలకొండ, బద్రగిరి, కురుపాం, చినమేరంగిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 35 పడకలు అందుబాటులోకి వస్తాయి. అడ్డతీగల, వై.రామవరం కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మదనపల్లె, చిత్తూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, హిందూపురం, తణుకులలో మరో ఆరు 10 పడకల కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

నిధులు & సిబ్బంది కేటాయింపు

ప్రతి 10 పడకల కేంద్రానికి ఒక వైద్యాధికారి, ఒక పోషకాహార సలహాదారు, స్టాఫ్ నర్స్, వంట/ టెండర్ సిబ్బందిని కేటాయించారు. 2026-27లో మౌలిక వసతులు, నిర్వహణ ఖర్చుల కోసం రూ. 4.42 కోట్లు, మానవ వనరుల కోసం ఏడాదికి రూ. 12.22 కోట్లు మంజూరు చేశారు.

99 శాతం విజయవంతం

ఈ కేంద్రాల్లో అందిస్తున్న చికిత్సతో చిన్నారులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. 2025-26లో 6,195 మంది చేరగా 6,168 మంది కోలుకున్నారు. 2026 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 2,492 మంది చేరగా 2,462 మంది కోలుకున్నారు. ఈ కాలంలో కోలుకున్న వారి శాతం 98.80గా నమోదైంది.