

చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో విత్తన బంతులు (సీడ్ బాల్స్) చల్లే వినూత్న కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ జారవిడవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో పవన్ కళ్యాణ్ ఈ సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని అటవీశాఖకు నిర్దేశించగా, ప్రజా భాగస్వామ్యంతో లక్ష్యాన్ని మించి రికార్డు స్థాయిలో 3.80 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించారు. వీటిలో ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్‌ను వివిధ అటవీ ప్రాంతాల్లో మానవ వనరుల సాయంతో వెదజల్లే ప్రక్రియ పూర్తయింది.
మనుషులు ప్రవేశించలేని దట్టమైన, మారుమూల అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణకు ఈ డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. చింతూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో 2.71 లక్షల బంతులను మానవ వనరులతో చల్లారు. మిగిలిన వాటిని క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వర్షాలు, భూ అనుకూలతల ఆధారంగా కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు విస్తరించనున్నారు.
పర్యావరణహిత, దేశవాళీ వృక్ష జాతులైన వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని వంటి విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్‌ను సోమవారం డ్రోన్ల ద్వారా వెదజల్లారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పులను తట్టుకునేలా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
