

గ్రామీణ విద్యార్థుల ప్రతిభ అపోహలను చెరిపేసింది: మాజీ మంత్రి హరీశ్‌రావు
పట్టుదల, ఏకాగ్రత ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో అద్భుతాలు సాధించగలరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 'కేఆర్ ఉచిత ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్' ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు అత్యుత్తమ సంస్థల్లో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. వేలాది మందికి ఉచితంగా మార్గనిర్దేశం చేస్తున్న కొలుపుల రాములు కృషిని కొనియాడారు. ఒకప్పుడు ఐఐటీ, ఎన్ఐటీలు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకే పరిమితమనే భావన ఉండేదని, కానీ గ్రామీణ విద్యార్థులు తమ ప్రతిభతో ఆ అపోహను చెరిపివేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రైవేటు ఉద్యోగాలకే పరిమితం కాకుండా సివిల్ సర్వీసెస్, డిఫెన్స్ రంగాల వైపు అడుగులేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లు స్థాపించి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం
అనంతరం సిద్దిపేట విపంచి కళానిలయంలో హైదరాబాద్ సింధు క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన రెండు రోజుల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయడం సులువవుతుందని, 40 ఏళ్లు దాటిన మహిళలు విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరలోనే సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి తరహాలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
సిద్దిపేటలో 95 శాతం పనులు పూర్తయిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మిగిలిన 5 శాతం నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
