
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
పోలవరం జిల్లా ఏటపాక మండలంలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది.గొమ్ముకొత్తగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
పోలవరం జిల్లా ఇన్చార్జి ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. మొత్తం పది మంది బృందంగా నదిలోకి దిగిన వీరు చేతులు పట్టుకుని, బట్టలు, దోమతెరలను ఉపయోగిస్తూ చేపలు పడుతున్న సమయంలో కొందరు లోతైన ప్రాంతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నీటి మట్టం తక్కువగానే ఉన్నప్పటికీ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయం కోసం సమాచారం ఇవ్వకుండా, మిగిలిన వారు ముందుగా గల్లంతైన వారి కోసం వెతకడం వల్ల అధికారులకు విషయం ఆలస్యంగా తెలిసినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ దుర్ఘటనలో తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌లుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఐదుగురు గిరిజనులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి దుర్ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అండగా నిలిచి, అవసరమైన సహాయం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఐదుగురు గిరిజనుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
వరద ప్రవాహం ఒక్కసారిగా ఉద్ధృతం కావడంతో ఐదుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయవిదారకమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం మరింత హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
