Let's talk: editor@tmv.in
గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ నేతతో పాటు కుటుంబ సభ్యుల అరెస్ట్

గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ నేతతో పాటు కుటుంబ సభ్యుల అరెస్ట్

Gaddamidi Naveen
19 జులై, 2026

గుంటూరు నగరంలోని నగరంపాలెంలో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్డు కార్యదర్శి మల్లెల వెంకట రమణమూర్తి సహా ఆయన కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10 వేల లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, నగరంపాలెంకు చెందిన నాగేశ్వరరావు ఈ నెల 15న తన ఇంటి ముందు ఉన్న బోరును స్వంత ఖర్చులతో మరమ్మతు చేయిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ వార్డు కార్యదర్శి మల్లెల వెంకట రమణమూర్తి రూ.10 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అది తన వ్యక్తిగత పనిగా చేపడుతున్నందున డబ్బులు ఇవ్వలేనని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగేశ్వరరావు కుమారుడు తన తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో రమణమూర్తి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మళ్లీ నాగేశ్వరరావు ఇంటి వద్దకు చేరుకుని దాడికి దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులపై దాడి చేయడమే కాకుండా, ఆయన భార్యను వివస్త్రను చేసి అవమానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కుటుంబం జూలై 16న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహ ప్రవేశం, మహిళ మర్యాదను అవమానించే ఉద్దేశంతో దాడి చేయడం, మహిళను అవమానించే చర్యలు, గాయపరచడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లను అమలు చేశారు. నిందితులందరినీ శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు, శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

మహిళ అవమానంపై రాజీ లేదు.. సీఎం చంద్రబాబు

ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఏ మహిళకైనా అవమానం జరగడం పూర్తిగా అంగీకరించలేనిది, మన సమాజంలో దానికి చోటు లేదు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. క్రిమినల్ కేసు నమోదైంది, నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో భాగస్వామ్యమైన సదరు పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేస్తున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను నిష్పక్షపాతంగా, కఠినంగా చేస్తుందని, తప్పు చేసిన ఏ ఒక్కరికీ రక్షణ ఉండదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళకు తమ గౌరవం, భద్రత రక్షించబడుతుందనే నమ్మకం ఉండాలని ఆయన అన్నారు.

మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. టీడీపీ పార్టీ కార్యకర్త రమణమూర్తిని అన్ని రకాల పార్టీ పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPNewsBreakingNewsCrimeNewsAndhraNewsTDPPoliticalNewsLawAndOrderWomenSafetyJusticeForWomenCrimeInAndhra
గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ నేతతో పాటు కుటుంబ సభ్యుల అరెస్ట్ - Tholi Paluku