Let's talk: editor@tmv.in
గుంటూరు ఘ‌ట‌న‌.. మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు ఘ‌ట‌న‌.. మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Gaddamidi Naveen
19 జులై, 2026

మహిళల గౌరవం, భద్రత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ పడదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దారుణ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబ సభ్యులు తన్ను కలిసి జరిగిన ఉదంతాన్ని వివరించిన వెంటనే, ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరంపాలెం పోలీసులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శాసనసభ్యురాలి ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు సెక్రటరీ మల్లెల వెంకట రమణమూర్తి (మల్లెల మూర్తి) ని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు మాధవి అధికారికంగా ప్రకటించారు.

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

మహిళలను అవమానించే, వేధించే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్ష అనుభవించాల్సిందే. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని సమర్థించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు.

గతంలో కూడా మహిళలను, విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని ఆమె గుర్తుచేశారు. ఈ కేసులో కూడా చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో మహిళల భద్రతకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్‌లు
GunturGunturWestGallaMadhaviWomenSafetyWomenRespectJusticeForWomenAndhraPradeshTDPLawAndOrderWomenEmpowermentCrimeNewsTeluguNews