
గిరిజన గుండెల్లో వెలుగుతున్న ప్రజా పాలన: మంత్రి సీతక్క
ప్రజల ప్రభుత్వం సాధించిన అరుదైన ఘనత ఇది. ఆదివాసీ గుండెల్లో ప్రజాపాలన వెలుగులు చిందిస్తూ, ఆదివాసీ గర్వానికి ప్రతీకగా జెండా ఎగురుతోందని మంత్రి సీతక్క తన “ఎక్స్” వేదిక ద్వారా పేర్కొన్నారు. చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఈ ఘట్టం, ఎన్నడూ చూడని సంబరాలకు నాంది పలుకుతోంది అని తెలిపారు.
సమ్మక్క–సారలమ్మ తల్లి దేవతలకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజల ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంకల్పించిన 3 సంవత్సరాల లక్ష్యం ఇప్పుడు సాకారమైంది. అటవీ దేవతలైన సమ్మక్క–సారలమ్మ పునర్నిర్మాణ పనులు పూర్తికావడం ద్వారా, ఇది కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిందని. ఆ పవిత్ర స్థలంలో ఆలయాల పునర్నిర్మాణం పూర్తి కావడం వల్ల, లక్షలాది భక్తుల ఆకాంక్ష నెరవేరినట్లయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం, ఆదివాసీ సమాజంపై చూపిన గౌరవానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఈ ఘట్టం రాబోయే వెయ్యేళ్ల పాటు చరిత్రలో నిలిచే సాక్ష్యంగా మిగులుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల పాలన అంటే ఇదేనని, మాటలకే కాదు పనులకే ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమిదేనని మరోసారి నిరూపితమైందని మంత్రి ఈ సంర్భంగా పేర్కొన్నారు.
