Let's talk: editor@tmv.in
గాజువాకలో రూ.2,000 కోట్ల విలువైన భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి: డిప్యూటీ స్పీకర్

గాజువాకలో రూ.2,000 కోట్ల విలువైన భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి: డిప్యూటీ స్పీకర్

Gaddamidi Naveen
29 జులై, 2026

విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తు నుంచి రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె. రఘురామకృష్ణ రాజు తెలిపారు.

మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీ భవనంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ పరిశ్రమ స్థాపన కోసం 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనంతరం సంస్థ దివాలా తీయడంతో ప్రస్తుతం ఆ భూములు బ్యాంకుల జప్తుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఏపీ రిఫ్రాక్టరీస్ సంస్థ భూములు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూసేకరణ బాధితులకు సంబంధించిన ఆర్-కార్డుల (రీహాబిలిటేషన్ కార్డులు) అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు మొదటి వారంలో ఉన్నతాధికారులు, బ్యాంకు ప్రతినిధులతో మరోసారి ఫిర్యాదుల కమిటీ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాతీయ రహదారి-16కు ఆనుకుని ఉన్న ఏపీ రిఫ్రాక్టరీస్ విలువైన భూములు జప్తు ప్రక్రియలో కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను జప్తు చేసే చర్యలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు జారీ చేసిన ఆర్-కార్డుల విషయంలో 1,203 మంది రెగ్యులరైజేషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని, వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, గురజాల జగన్మోహన్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
GajuwakaVisakhapatnamAPRefractoriesAndhraPradeshRaghuramaKrishnaRajuAssemblyCommittee
గాజువాకలో రూ.2,000 కోట్ల విలువైన భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి: డిప్యూటీ స్పీకర్ - Tholi Paluku