Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’.. భారత్‌కు ట్రంప్ ఆహ్వానం

గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’.. భారత్‌కు ట్రంప్ ఆహ్వానం

Shaik Mohammad Shaffee
19 జనవరి, 2026

గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి సాధన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్రంప్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మధ్యప్రాచ్యంలో శాంతిని పటిష్టం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలకు కొత్త విధానంతో పరిష్కారాలు కనుగొనడమే ఈ బోర్డు లక్ష్యమని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా స్ట్రిప్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం

గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలుగా కొనసాగిన ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణం, పరిపాలన పర్యవేక్షణ, అంతర్జాతీయ నిధుల సమీకరణ మొదట ఈ బోర్డు ప్రధాన బాధ్యతలుగా ఉండాల్సి ఉంది. ఇప్పుడు దాని పరిధి మరింత విస్తరిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

20 పాయింట్ల శాంతి రోడ్‌మ్యాప్

ట్రంప్ తన లేఖలో గత ఏడాది సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంక్షోభ పరిష్కార సమగ్ర ప్రణాళికను, అలాగే మధ్యప్రాచ్య శాంతి కోసం 20 పాయింట్ల రోడ్‌మ్యాప్ ను ప్రస్తావించారు. ప్రధానంగా గాజాను ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం, అక్కడి ప్రజల్లో ఉన్న అతివాద భావజాలాన్ని తొలగించి (డీ-రాడికలైజ్డ్) ప్రశాంతమైన వాతావరణం కల్పించడం దీని ఉద్దేశం. అలాగే గాజా నుండి పొరుగు దేశాలకు ఎలాంటి ముప్పు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజాను మళ్లీ నిర్మించి, అక్కడి ప్రజల బాగు కోసం అభివృద్ధి పనులను చేపడతారు. ఈ మార్పుల ద్వారా గాజాను హింస నుంచి శాంతి వైపు, వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే తమ లక్ష్యమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

కీలక నేతలతో ఎగ్జిక్యూటివ్ కమిటీ

ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఒక శక్తివంతమైన కార్యనిర్వాహక బృందాన్ని (ఫౌండింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్) వైట్ హౌస్ ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ బృందంలో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త జారెడ్ కుష్నర్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా వంటి వారు ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. వీరితో పాటు మధ్యప్రాచ్య వ్యవహారాల నిపుణుడు స్టీవ్ విట్కాఫ్, ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ రోవన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ కూడా ఈ బోర్డులో ఉంటారు. ఈ ఉన్నత స్థాయి బృందం పర్యవేక్షణలోనే 'నేషనల్ కమిటీ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాజా' అనే ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. గాజా ప్రాంతంలో పాలనను సాగించడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం ఈ విభాగం యొక్క ప్రధాన బాధ్యత.

భారత్‌కు ఆహ్వానం

బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్‌ను భాగస్వామిగా చేసేందుకు ట్రంప్ ఆహ్వానం పంపినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. గాజా శాంతి, అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకమవుతుందని అమెరికా భావిస్తోంది. ప్రపంచ వేదికపై భారత్‌కు పెరుగుతున్న విశ్వసనీయతకు ఇది మరో నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గాజా కోసమే కాదు.. ప్రపంచవ్యాప్త శాంతి కోసం!

ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' (శాంతి మండలి) ఏర్పాటు కేవలం గాజా సమస్యను పరిష్కరించడానికే పరిమితం కాదని, దీని లక్ష్యం ఇంకా పెద్దదని అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలేకి రాసిన లేఖలో ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా వాటిని పరిష్కరించడానికి ఈ బోర్డు ఒక కొత్త దారిని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. 'ఫైనాన్షియల్ టైమ్స్' కథనం ప్రకారం, యుద్ధాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడం, అక్కడ చట్టబద్ధమైన పాలన వచ్చేలా చూడటమే ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం. శాశ్వత శాంతి కావాలంటే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, తెలివైన ఆలోచనలతో, ధైర్యంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలని ఈ బోర్డు నియమావళిలో పేర్కొన్నారు. గతంలో విఫలమైన పద్ధతుల జోలికి వెళ్లకుండా, అందరికీ మేలు చేసే ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ సరికొత్త వ్యవస్థ అసలు లక్ష్యం.

అగ్రనేతల సారథ్యంలో..

వైట్ హౌస్ అధికారులు వెల్లడించిన దాని ప్రకారం, ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' అత్యున్నత విభాగంలో కేవలం వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనికి నేతృత్వం వహించనున్నారు.

సభ్యత్వం-రూల్స్ ఏమిటి?

గాజాలో శాంతిని నెలకొల్పడానికి, ప్రపంచ వివాదాలను పరిష్కరించడానికి డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్‌లో సభ్యత్వం పొందేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను పెట్టింది. ఈ బోర్డులో ఎల్లకాలం సభ్యులుగా ఉండాలనుకునే దేశాలు 1 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులను యుద్ధంతో ధ్వంసమైన గాజా పునర్నిర్మాణానికి ఉపయోగిస్తారు. విరాళం ఇవ్వని దేశాలకు కేవలం మూడేళ్ల కాలపరిమితితో సభ్యత్వం లభిస్తుంది.

ఇప్పటివరకు ఆహ్వానం అందుకున్న దేశాలు

ఇప్పటికే చాలా దేశాలకు ఈ బోర్డులో చేరాలని ఆహ్వానాలు అందాయి. భారత్‌తో పాటు హంగేరీ (ప్రధాని విక్టర్ ఓర్బన్ ఇప్పటికే అంగీకరించారు), కెనడా, టర్కీ, ఈజిప్ట్, పరాగ్వే, అర్జెంటీనా, అల్బేనియా, జోర్డాన్, గ్రీస్, సైప్రస్, పాకిస్థాన్ దేశాలకు కూడా ఆహ్వానాలు అందాయి. సభ్యుల అధికారిక జాబితాను స్విట్జర్లాండ్‌లోని 'దావోస్' ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రకటించే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ అభ్యంతరం:

అయితే ఈ బోర్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమతో చర్చించకుండానే ఈ కమిటీని ఏర్పాటు చేశారని వారు అసహనం వ్యక్తం చేశారు.

కీలక పాత్రలో టర్కీ, ఖతార్

హమాస్ గ్రూపుతో మంచి సంబంధాలు ఉన్న టర్కీ, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలు ఈ బోర్డులో ఉండటం వల్ల.. హమాస్ ఆయుధాలను వదిలేలా ఒప్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అమెరికా భావిస్తోంది.

ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయమా?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం నిధుల కొరతతో బలహీనపడింది. ఈ తరుణంలో ట్రంప్ ఏర్పాటు చేస్తున్న ఈ 'బోర్డ్ ఆఫ్ పీస్' ప్రపంచ వివాదాలను పరిష్కరించే విషయంలో ఐక్యరాజ్యసమితికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’.. భారత్‌కు ట్రంప్ ఆహ్వానం - Tholi Paluku