
గాంధీ కుటుంబం దేశానికి స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. అలాగే దేశ సమగ్రత, సమైక్యత కాపాడటానికి ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారు అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయస్సు 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కులగణన చేసి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం అన్నారు.