
ఖమేనీ హత్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే: పుతిన్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడి వైమానిక దాడిలో హతమార్చడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణం అంతర్జాతీయ చట్టాలను, మానవ నైతిక విలువలను తుంగలో తొక్కడమేనని ఆయన అభివర్ణించారు. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం క్రెమ్లిన్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ లాంటి ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంపై ముందుగా ప్లాన్ చేసి జరిపిన ఈ దాడులను రష్యా విదేశాంగ శాఖ 'రెచ్చగొట్టే దురాక్రమణ'గా పేర్కొంది. తక్షణమే దౌత్య మార్గంలో చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పుతిన్ శనివారం తన జాతీయ భద్రతా మండలితో అత్యవసరంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడుల అనంతరం తలెత్తిన పరిణామాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా ఉన్న ఇరాన్‌పై ఈ రకమైన దాడులు జరపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా పునరుద్ఘాటించింది. ఇదిలా ఉండగా, యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల గగనతలం మూతపడటంతో రష్యా పౌరులు భారీగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు. దాదాపు రెండు లక్షల మంది రష్యన్లు ప్రస్తుతం యూఏఈ, మాల్దీవులు వంటి ప్రాంతాల నుండి స్వదేశానికి తిరిగి రాలేక, ఇతర ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారని జాతీయ పర్యాటక రంగ సంఘం అధ్యక్షుడు అలెక్సీ వోల్కోవ్ వెల్లడించారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా గగనతలం రష్యాకు మూతపడటంతో, గత కొంతకాలంగా యూఏఈ విమానాశ్రయాలే రష్యా పౌరులకు ప్రధాన ప్రయాణ కేంద్రాలుగా (హబ్) మారాయి. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణి దాడులు జరగడం వల్ల పర్యాటకులే కాకుండా వ్యాపార పనుల మీద వెళ్ళిన రష్యన్లు కూడా అక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా దుబాయ్‌లోని ప్రముఖ హోటళ్లు, పర్యాటక ప్రాంతాల సమీపంలో పేలుళ్లు సంభవించడం రష్యన్ పెట్టుబడిదారులను, పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్, గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని, ఎప్పుడు ఏమవుతుందో తెలియని అస్థిరత నెలకొందని రష్యన్ అధికారిక వార్తా సంస్థ టాస్ పేర్కొంది.
