Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఖమేనీ హతం.. రణరంగంగా మారిన మధ్యప్రాచ్యం

ఖమేనీ హతం.. రణరంగంగా మారిన మధ్యప్రాచ్యం

Shaik Mohammad Shaffee
1 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడి వైమానిక దాడిలో హతమార్చడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం నడిబొడ్డున ఉన్న కీలక లక్ష్యాలపై భారీ పేలుళ్లకు పాల్పడింది. టెహ్రాన్ ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకోగా, భూమి కంపించినంత పనైందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాయకత్వ శూన్యంలో ఇరాన్

ఖమేనీ మరణించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ రక్షణ మండలి అత్యవసరంగా సమావేశమైంది. అయితే ఈ సమావేశంపై కూడా ఇజ్రాయెల్-అమెరికా దళాలు మెరుపు దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సైనిక దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అబ్దోల్ రహీమ్ మౌసవి, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నసీర్‌జాదే, రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ మహమ్మద్ పాక్‌పూర్ సహా ఖమేనీ భద్రతా సలహాదారులు మరణించారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం దేశాన్ని నడపడానికి తాత్కాలికంగా ఒక కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

'రెడ్ లైన్ దాటారు'.. ఇరాన్ హెచ్చరిక

ఖమేనీ హత్యను "ఘోరమైన నేరం"గా అభివర్ణించిన ఇరాన్ క్యాబినెట్, దీనికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించింది. "మీరు మా లక్ష్మణ రేఖను దాటారు, దీనికి భారీ ధర చెల్లించుకోక తప్పదు. మీరు భిక్షాటన చేసే స్థాయికి దెబ్బ కొడతాం" అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ కాలిబాఫ్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా తమ చరిత్రలోనే అతిపెద్ద దాడికి సిద్ధమయ్యామని ప్రకటించాయి.

ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. "ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ శక్తితో విరుచుకుపడతాం" అని హెచ్చరించారు. ఈ దాడులు ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దొరికిన గొప్ప అవకాశమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సామాన్యులపై దాడుల ప్రభావం

యుద్ధం కారణంగా ఇరు దేశాల్లోనూ భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 115 మంది విద్యార్థినులు మరణించడం అత్యంత విషాదకరం. అలాగే నైరుతి ప్రాంతంలో మరో 15 మంది చనిపోయారు. ఇటు ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఒక మహిళ, అటు దుబాయ్‌లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్‌లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ కూడా ఈ దాడుల్లో పాక్షికంగా దెబ్బతిని మంటల్లో చిక్కుకుంది. ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల పాటు విషాద దినాలను ప్రకటించగా, మరోవైపు కొందరు ఇరాన్ పౌరులు తమ దేశంలో మార్పు వస్తుందన్న ఆశతో రహస్యంగా సంబరాలు చేసుకుంటున్నారు.

వ్యూహాత్మక ఆపరేషన్

ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా పక్కా ప్రణాళికతో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా రివల్యూషనరీ గార్డ్స్ కమాండ్ సెంటర్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు మరియు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. రంజాన్ మాసం ప్రారంభంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు, కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడంపై అమెరికాలో డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

ఖమేనీ హతం.. రణరంగంగా మారిన మధ్యప్రాచ్యం - Tholi Paluku