
క్వాంటం శిక్షణలో ఏపీ యువత అద్భుత స్పందన
ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ వేదికగా నిర్వహిస్తున్న 'అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్' కోర్సులో రాష్ట్రం నుంచి ఏకంగా 50 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువతలో పెరుగుతున్న ఈ సాంకేతిక ఆసక్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
సాంకేతిక విప్లవానికి నాంది
రాష్ట్ర యువత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం పట్ల ముఖ్యమంత్రి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "భవిష్యత్ సాంకేతికతలపై మన యువతకు ఉన్న అంకితభావానికి ఈ స్పందనే నిదర్శనం. లక్ష మంది అత్యంత నైపుణ్యం కలిగిన క్వాంటం నిపుణులను తయారు చేయాలనే మా సంకల్పానికి ఈ ఆదరణ మరింత బలాన్ని ఇచ్చింది" అని ఆయన పేర్కొన్నారు. క్వాంటం పరిశోధనలు, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మెడల్స్ సాధించిన వారికి సత్కారం
ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను స్వయంగా కలిసి సత్కరిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులు డీప్‌టెక్ రంగాల వైపు మొగ్గు చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డీప్‌టెక్ రంగమే లక్ష్యంగా
సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధిని సాధించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని, అందులో భాగంగానే క్వాంటం టెక్నాలజీ వంటి డీప్‌టెక్ రంగాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐఐటీలు, ఐఐఎస్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్పీటీఈఎల్ వేదిక ద్వారా మరిన్ని అంతర్జాతీయ స్థాయి కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని గ్లోబల్ టెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, దేశపు డీప్‌టెక్ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎన్పీటీఈఎల్ అంటే ఏమిటి?
ఎన్పీటీఈఎల్ అనేది భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక గొప్ప ఆన్లైన్ విద్యా వేదిక. మన దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అన్నీ కలిసి దీనిని నిర్వహిస్తున్నాయి. ఐఐటీలలో చదవలేకపోయిన విద్యార్థులకు కూడా అక్కడి ప్రొఫెసర్ల ద్వారా నాణ్యమైన సాంకేతిక విద్యను ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో అందించడమే ఈ వేదిక ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులు కూడా ఇంట్లోనే ఉండి ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేర్చుకోవచ్చు.
క్వాంటమ్ కోర్సు ప్రత్యేకతలేమిటి?
సాధారణ కంప్యూటర్లు ఏ పనైనా 'బిట్స్' (0 లేదా 1) రూపంలో చేస్తాయి, కానీ క్వాంటం కంప్యూటర్లు అంతకంటే వేగంగా పనిచేస్తాయి. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు క్వాంటం ఫిజిక్స్ ఆధారంగా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయో నేర్పిస్తారు. ముఖ్యంగా ఇందులో సూపర్‌పోజిషన్, ఎంటాంగిల్‌మెంట్ వంటి సంక్లిష్టమైన అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా వివరిస్తారు. కేవలం థియరీ మాత్రమే కాకుండా ఈ అధునాతన కంప్యూటర్లలో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో (క్వాంటమ్ అల్గారిథమ్స్) శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మనం వాడుతున్న కంప్యూటర్ల స్థానంలో ఇవే రాబోతున్నాయి కాబట్టి ఈ కోర్సు ఎంతో విలువైనది.
ఎవరికి ఉపయోగం? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?
ఈ కోర్సు కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా సైన్స్ మీద ఆసక్తి ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. నేటి కాలంలో సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ (ఫైనాన్స్), ఆరోగ్య రంగం (కొత్త మందుల తయారీ), రక్షణ అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో క్వాంటం టెక్నాలజీ తెలిసిన వారికి ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఐఐటీ మద్రాస్ - ఎన్పీటీఈఎల్ నుంచి నేరుగా సర్టిఫికేట్ లభిస్తుంది. అంతేకాకుండా పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఇచ్చి గౌరవిస్తారు ఇది వారి కెరీర్‌కు ఒక గొప్ప గుర్తింపుగా మారుతుంది.
