Let's talk: editor@tmv.in
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
21 జులై, 2026

న‌గ‌రంలోని క్యూర్ పరిధిలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలోనే మరో ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బోనాల నాటికి ఈ కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తించేలా నిర్మాణాలను పూర్తి చేస్తామని వెల్లడించారు.

సోమవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్‌తో పాటు మీ సేవ, వాట్సాప్ ద్వారా దరఖాస్తు సదుపాయాలను ఆవిష్కరించారు. అలాగే పథకంపై సోషల్ మీడియాలో అవగాహన కల్పించిన నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొండా నాగరాజుకు రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను ప్రారంభించామని, ఇప్పుడు క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. గతంలో నగరానికి 30–35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడంతో చాలామంది లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండలేకపోయారని, అందుకే ఇప్పుడు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకే సమీపంలో ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు.

ఈ పథకం కింద 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కూడిన ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుని వాటా నాలుగు విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. స్థలం విలువ రూ.40–60 లక్షల వరకు ఉండగా, దానిని మహిళ పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. పది సంవత్సరాల వరకు విక్రయానికి అనుమతి ఉండదని, అయితే బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

360 డిగ్రీల పరిధిలో వడపోత అనంతరం ఎక్కువ దరఖాస్తులు వస్తే బహిరంగంగా లాటరీ తీస్తారు. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే దరఖాస్తుదారుడు కట్టిన రూ. 10,000 తిరిగి చెల్లిస్తారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి.

జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ (8096958096), వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుడి పేరిట క్యూర్ పరిధిలో ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు. అర్హుల సంఖ్య ఎక్కువైతే బహిరంగ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే దరఖాస్తుదారుడు కట్టిన రూ. 10,000 తిరిగి చెల్లిస్తారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. త్వరలో మధ్యతరగతి ప్రజలకు కూడా గృహాల విషయంలో శుభవార్త ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణం చేపట్టే తొలివిడత ప్రాంతాలు

మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, రాయదుర్గం, తట్టిఅన్నారం-బండ్లగూడ, కౌకూర్, రెడ్‌హిల్స్ (నీలోఫర్ ఆసుపత్రి సమీపం), హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్ (ఎమ్మెల్యే కాలనీ), కుల్సుంపురా, నందిముసలిగూడ, సిటీ పోలీస్ లైన్స్ (అంబర్‌పేట్), కేపీహెచ్‌బీ కాలనీ, పోచారం ఎల్‌ఐజీ కాలనీ, గాజులరామారం, పాటిగడ్డ, మారేడ్‌పల్లి-మహేంద్రహిల్స్ , గడ్డిఅన్నారం ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్ ప్రాంతాలలో ఈ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎండీ వి.పి. గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల, ఎమ్‌ఎల్‌సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
IndirammaIlluIndirammaHousingTelanganaHyderabadHousingForAllCMRevanthReddyPonguletiSrinivasaReddyCongressGovernment
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి - Tholi Paluku