
కోహ్లీ,రోహిత్ స్థానాలు ఎవ్వరూ భర్తీ చేయలేరు-రవిశాస్త్రి
భారత జట్టులో తరం మార్పుపై చర్చలు మళ్లీ వేడెక్కుతున్న సమయంలో మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అనుభవం విలువను బలంగా పునరుద్ఘాటించాడు. యువతరానికి పూర్తిస్థాయి అవకాశాలు ఇవ్వాలంటూ ఉత్పన్నమవుతున్న వ్యాఖ్యల్ని ఔదాసీన్యంగా తీసుకుంటూ, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశాడు. వీరిద్దరూ తెల్లబంతి క్రికెట్‌కి అద్భుతమైన మేటర్లని, సరైన సమయంలో “స్విచ్ ఆన్” అయ్యే సామర్థ్యంతో టోర్నమెంట్ దిశనే మార్చగలరని ఆయన పేర్కొన్నాడు.
జట్టులోని యువ ఆటగాళ్లూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హర్షిత్ రానా మాటల్లో, కోహ్లీ,రోహిత్ ప్రాంగణంలో ఉంటే మొత్తం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణమే మారిపోతుందని చెప్పారు. వారిద్దరి సాన్నిధ్యం యువకులకు ధైర్యం, స్థిరత్వం ఇస్తుందని ఆయన అన్నాడు. అలాగే కె.ఎల్. రాహుల్ కూడా ఒత్తిడిలో ఆడేటప్పుడు ఈ ఇద్దరి ప్రశాంతత ఎంతటి భరోసా ఇస్తుందో వివరించాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో, నిర్ణయాత్మక క్షణాల్లో వారి సలహాలు, ప్రవర్తన, అనుభవం జట్టుకు మరింత బలం చేకూరుస్తాయని ఆయన అభిప్రాయం వెల్లడించారు.
తరం మార్పు,అవకాశాలు,ప్రపంచకప్ వ్యూహాలు ఈ అంశాలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, శాస్త్రి, పలువురు ఆటగాళ్ల సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. ఒత్తిడిలోనూ నిలబడే ధైర్యం, మ్యాచ్‌ను ఆడే తెలివితేటలు, మంచి నిర్ణయాలు తీసుకునే స్వభావం వంటి గుణాలు ఒక్కరోజులో రాకపోవు. 2027 ప్రపంచకప్ దిశగా వెళ్లే భారత జట్టుకు అనుభవజ్ఞులైన క్రికెటర్ల ఉనికే యువతరానికి మార్గనిర్దేశం చేస్తుందని వారు చెబుతున్నారు.
