

కోహెడలో దేశంలోనే తొలి అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం: మంత్రి వాకిటి శ్రీహరి
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సమగ్ర సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న దేశంలోనే మొట్టమొదటి అంతర్గత, ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ భవన నిర్మాణానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముదిరాజుల సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయబోనని, వారి అభివృద్ధి కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకే కాకుండా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో కోహెడ ఎగుమతుల కేంద్రం మరో మైలురాయిగా నిలవనుందని మంత్రి తెలిపారు. సముద్రతీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్గత రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
తెలంగాణ ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 2025లో రాష్ట్రంలో 4.20 లక్షల టన్నుల చేపలు, 15 వేల టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి నమోదైందన్నారు. ఈ కేంద్రంలో శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, హోల్‌సేల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.
