
కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వానికి వైఎస్ షర్మిల విజ్ఞప్తి
కడప జిల్లాలో ఇటీవల కోవిడ్-19 లక్షణాలతో పాటు పాజిటివ్ కేసులు నమోదవడం, మరణాలు సంభవించాయన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన షర్మిల, కడప జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. జిల్లాలో కోవిడ్ పరిస్థితి తీవ్రత, ప్రజారోగ్య శాఖ సన్నద్ధత, తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె కోరారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించడంతో పాటు, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్సా సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని షర్మిల ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కోవిడ్ మరోసారి విస్తరించకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని, ప్రజారోగ్య పరిరక్షణలో సమష్టి బాధ్యతతో ముందుకు రావాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
