Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కోల్‌కత్తాలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు చేదు అనుభవం

కోల్‌కత్తాలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు చేదు అనుభవం

Pinjari Chand
9 మార్చి, 2026

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఉదయం కాళీ ఘాట్‌ ఆలయాన్ని సందర్శించిన సమయంలో అక్కడి ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. ఆలయం బయట కొందరు ‘గో బ్యాక్’ నినాదాలు చేస్తూ ఆయనకు బ్లాక్ ఫ్లాగ్‌లు చూపించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని, సీఈసీ తన ఆలయ దర్శనాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టారు.

ఇక ఆదివారం రాత్రి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో కూడా నిరసనలు చోటుచేసుకున్నాయి. విమానాశ్రయం నుంచి కాన్వాయ్ బయలుదేరినప్పుడు ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) కార్యకర్తలు ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు. కాన్వాయ్ కైఖాలి ప్రాంతం గుండా వీఐపీ రోడ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో కూడా సీఈసీకి బ్లాక్ ఫ్లాగ్‌లు చూపించారు. ఇదే సమయంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు కూడా విమానాశ్రయం వెలుపల నిరసనలు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని కఠినంగా నియంత్రించి, నిరసనలు మరింత ఉదృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పర్యటన కోసం జ్ఞానేశ్‌కుమార్ కోల్‌కత్తాకు వచ్చారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్. సంధు, వివేక్‌జోషి కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ రోజు సీఈసీ బృందం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలు, సూచనలు వింటుంది. అనంతరం అమలు సంస్థల నోడల్ అధికారులతో పాటు సీనియర్ పోలీసు, పరిపాలనా అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా శాసన వ్యవస్థ పరిస్థితి, భద్రతా బలగాల మోహరింపు ప్రణాళిక, అమలు సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చ జరగనుందని అధికారులు తెలిపారు.

మంగళవారం పర్యటన చివరి రోజున సీఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ అగర్వాల్‌తో పాటు సీఏపీఎఫ్ నోడల్ అధికారితో సమావేశం కానుంది. అనంతరం బూత్ స్థాయి అధికారులతో సమావేశమై, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కోల్‌కతా నుంచి బయలుదేరనున్నారు.

కోల్‌కత్తాలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు చేదు అనుభవం - Tholi Paluku