
కోల్‌కతా తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: రామచందర్‌రావు
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఘటనకు గల కారణాలను వెలికితీసి, బాధ్యులను గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన రామచందర్‌రావు.. కోల్‌కతాలో జరిగిన తొక్కిసలాట విషాదమని పేర్కొన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై బాధ్యతను నిర్ధారించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినట్లుగా, ఈ ఘటనపై అందరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బాధ్యులెవరనే విషయాన్ని విచారణ ద్వారా తేల్చడం అత్యవసరమని స్పష్టం చేశారు.
19 మంది మృతి.. ఏడుగురి అరెస్టు
ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగాన్ సార్వజనిన్ దుర్గాపూజ మండపం వద్ద భారీగా భక్తులు గుమిగూడిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసుకు సంబంధించి పూజా కమిటీ కార్యదర్శి రాజ్‌కుమార్ సెవ్డా అలియాస్ రాజా, ఉపాధ్యక్షుడు శంతను దూబే సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వెదురు నిర్మాణం చేపట్టిన బిప్లబ్ ముఖర్జీ, జనసమూహ నియంత్రణ, వీఐపీ పాస్‌ల తనిఖీలతో సంబంధమున్న కౌశిక్ సాహా, పింటు దే, ప్రైవేటు భద్రతా బాధ్యతలు నిర్వహించిన సుమన్ చక్రవర్తి, రాజేశ్ పాల్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.
నిర్వాహకులు, ఇతరులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 105, 110, 3(5) సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మరో 14 మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై బాధ్యతను నిర్ధారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) దర్యాప్తు చేపట్టింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.
కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 18 నుంచి 20 వరకు బీఎన్‌ఎస్‌ఎస్ లోని సెక్షన్ 163ను అమలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంతో పాటు ఆయుధాలు ధరించడం వంటి చర్యలపై ఆంక్షలు విధించారు.
