
కోనసీమ రైతులను నిరాశపరిచిన కూటమి ప్రభుత్వం: వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్ర సాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, నీటి నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉండే కోనసీమలో ఈ ఏడాది చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
జిల్లాలో కేవలం 11 వేల క్యూసెక్కుల నీటిని సమర్థంగా నిర్వహించి విడుదల చేస్తే చివరి భూముల వరకు సాగునీరు చేరి సుమారు రూ.3,500 కోట్ల విలువైన పంటను రైతులు పండించగలరని తెలిపారు. రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చుకుని నారుమళ్లు వేసి సాగుకు సిద్ధమయ్యారని, కానీ సమయానికి నీరు అందకపోవడంతో వారి పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యపై రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వం మే 30న కాలువలకు నీరు విడుదల చేశామని, జూన్ 30 నాటికి చివరి ప్రాంతాలకు చేరుతుందని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు అందలేదన్నారు.
ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించినా, వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా నీరు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పర్యటించి ఫోటోషూట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలంటే చివరి ఆయకట్టు వరకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం 14,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని చెబుతున్నప్పటికీ, ఆ నీరు చివరి ప్రాంతాలకు ఎందుకు చేరలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో కాలువల పూడికతీత, నిర్వహణ పనులు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సైఫన్ నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేసినా సరైన ప్రణాళిక లేకపోవడంతో నీటి పంపిణీలో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై తాము రాజకీయాలు చేయడం లేదని, ఖరీఫ్ పంటను కాపాడేందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని స్పష్టం చేసిన జగ్గిరెడ్డి, వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
