
కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్లకు.. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కటం లెక్కకాదు: మంత్రి సవిత
కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద టీచర్లు చేపట్టిన ఆందోళనపై మంత్రి సవిత ఘాటుగా స్పందించారు. రాయలసీమ ఉపాధ్యాయులంతా ఆదివారం సమర శంఖం పూరించారని ఆమె పేర్కొన్నారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్లకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. డీఎస్సీ-2025 నిర్వహణపై విషప్రచారం కొనసాగిస్తే అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వైసీపీ అధినేత జగన్ను హెచ్చరించారు.
డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు ఉన్నా జగన్ దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మంత్రి సవిత సవాల్ చేశారు. అసెంబ్లీలో జగన్కు ఎంతసేపైనా మైక్ ఇచ్చి గౌరవంగా మాట్లాడే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అవసరమైతే మెగా డీఎస్సీపై ఒక రోజంతా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపామని మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రతిభ, కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను వైసీపీ నేతలు అవమానించేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఒకరి కష్టం, ప్రతిభ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీచర్లను అవమానించడమే పనిగా పెట్టుకోవడం జగన్కు తగదని సవిత అన్నారు.
