Let's talk: editor@tmv.in
కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్

కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకత్వంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. మంత్రి కొండా సురేఖ ఎన్నో ఏళ్లుగా రాజకీయానుభవం ఉన్న నాయకురాలని, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై స్పష్టత కోరుతూ ఋధ‌వారం షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎవరికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ తీసుకుంటాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటించినా, మరెవరైనా ప్రకటించినా అది చెల్లదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీలో నిర్దిష్ట ప్రక్రియ ఉందని, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని తెలిపారు. 'పచ్చ కాంగ్రెస్' వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత పచ్చ, ఎరుపు, నలుపు అనే తేడాలు ఉండవని, అందరూ కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో పాత కాంగ్రెస్ నేతల పాత్ర 70 శాతం, కొత్తగా పార్టీలో చేరిన నేతల కృషి 30 శాతం ఉందని చెప్పారు.

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. 22ఏపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని, కిందిస్థాయిలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్ - Tholi Paluku