Let's talk: editor@tmv.in
కొండా సురేఖపై వేటు.. హైకమాండ్‌ అనుమతితోనే: ఎంపీ మల్లు రవి

కొండా సురేఖపై వేటు.. హైకమాండ్‌ అనుమతితోనే: ఎంపీ మల్లు రవి

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

తెలంగాణ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్‌ నుంచి తొలగించే నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టమైన అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు. పార్టీలో ఆమెపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసును పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి హైకమాండ్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగిస్తున్న నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. కొండా సురేఖ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులు, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత పార్టీ అధిష్ఠానం కేబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

ఇదే వ్యవహారంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ గద్దం చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదు అందిందని మల్లు రవి తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షులపై చిన్నారెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తనకు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. చిన్నారెడ్డి, కొండా సురేఖకు సంబంధించిన రెండు కేసులపై పూర్తి సమాచారం సేకరించి, పార్టీకి నష్టం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వివరణాత్మక నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు.

కొండా సురేఖపై వేటు.. హైకమాండ్‌ అనుమతితోనే: ఎంపీ మల్లు రవి - Tholi Paluku