

కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. సీఎం సలహా మేరకు కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించినట్లు లోక్ భవన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి తన కేబినెట్ సహచరురాలు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నేతలపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న వివాదం మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నుంచి సురేఖను తొలగించేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు పలువురు ఎంపీలు కూడా ముఖ్యమంత్రితో కలిసి గవర్నర్‌ను కలిశారు.
సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలకు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కుమార్తె వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని కూడా వారు తప్పుపట్టారు.
ఢిల్లీలో హైకమాండ్ భేటీలు - క్రమశిక్షణా కమిటీ సిఫార్సులు
ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ గతంలోనే పార్టీ అధిష్ఠానానికి సురేఖతో పాటు రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ గాదె చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో జరిపిన చర్చల అనంతరం తాజా నిర్ణయాలు వెలువడ్డాయి.
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖ కూడా ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి తన వాదనను వివరించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను మంత్రిగా సమర్థంగా పనిచేస్తున్నానని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. కేబినెట్‌లో కొనసాగేందుకు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సురేఖ స్పష్టం చేశారు. తన కుమార్తె స్వతంత్ర వ్యక్తి అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సరికాదని అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానా అని ప్రశ్నించగా, ఈ విషయంపై ఆమె స్వతంత్రంగా వ్యవహరించిందని సమాధానమిచ్చారు.
తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనా సురేఖ విమర్శలు చేశారు. వారు స్వచ్ఛందంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, వారి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు. అయితే ఆ వ్యక్తి ఎవరో చెప్పేందుకు ఆమె నిరాకరించారు. అలా చెబితే మరో వివాదం తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. తనపై మాట్లాడిన ఎమ్మెల్యేలపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కూడా ఈ అంశంపై ఈమెయిళ్లు పంపినట్లు వెల్లడించారు.
జి. చిన్నారెడ్డి నియామకం రద్దు - నూతన బాధ్యతలు
ఇదిలా ఉండగా, మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌తో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్‌గా ఉన్న జి. చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. పార్టీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై విమర్శలు చేసిన గాదె చిన్నారెడ్డిపై కూడా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కీలక నియామకాలను చేపట్టింది. చిన్నారెడ్డి స్థానంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది.
