Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కేఎల్ యూనివర్సిటీలో రెండోరోజు ఉద్భవ్-2025 సందడి

కేఎల్ యూనివర్సిటీలో రెండోరోజు ఉద్భవ్-2025 సందడి

Shaik Mohammad Shaffee
4 డిసెంబర్, 2025

గిరిజన విద్యార్థుల ప్రతిభను దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ సంప్రదాయ, సంస్కృతీ కళా ఉత్సవం ఉద్భవ్-2025లో రెండవ రోజు భాగంగా కేఎల్ యూనివర్సిటీలో ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 4.30 గం.ల వరకు విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కాశ్మిర్ నుండి కన్యాకుమారి వరకు గిరిజన ప్రాంతాల విభిన్న సంస్కృతులను, చారిత్రాత్మిక నేపధ్యాలను, కళలను ఒకే వేదికపై వైవిధ్యభరితమైన రీతిలో ప్రదర్శించి భారతదేశ ఔనత్యాన్ని చాటిచెప్పారు.

కార్యక్రమంలో భాగంగా కృష్ణ జింక ప్రధాన వేదికపై ఉదయం జూనియర్ విభాగంలో నాటిక పోటీలు ఉధ్బవ్ ఆడిటోరియంలో సీనియర్ విభాగంలో దేశంలోని వివిధ ప్రాంతాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. అదేవిధంగా వివిధ వేదికలపై సీనియర్ విభాగంలో గ్రూపు, సోలో విభాగంలో శాస్త్రీయ, గిరిజన పాటల పోటీలు, జూనియర్ విభాగంలో సంస్కృత శ్లోకాల పోటీ, కవితా పఠనం పోటీలు, ఆంగ్ల పద్యాల పోటీలు, క్విజ్ పోటీలు జరిగాయి. వీటితో పాటు సీనియర్ విభాగంలో ఆంగ్లంలో, హిందీలో వకృత్వం పోటీలు, బహిరంగ చర్చ, సీనియర్ విభాగంలో స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి అదే వేదికపై సీనియర్ గ్రూప్ విభాగంలో దైవ భక్తి గీతాల గాత్ర పోటీలను నిర్వహించారు. వీటితో పాటు వివిధ వేదికలపై సీనియర్ గ్రూపు, సోలో విభాగంలో జానపద గేయాల గాత్ర పోటీలు, సంగీత వాయిద్యాల కచేరి పోటీలు, నృత్య, నాటిక, సంగీత, దృశ్య కళల ద్వారా సాంప్రదాయ కథనాల వక్త పోటీలు, ధియేటర్ మిమిక్రి, క్లాసికల్ - సెమి క్లాసికల్ సంగీత గాత్ర కచేరి పోటీలను నిర్వహించారు. ఉద్భవ్-2025లో మొదటి రోజు బుధవారం నాడు 18 విభాగాలు, రెండవ రోజు గురువారం నాడు 22 విభాగాలలో పోటీలను నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం నాడు 9 విభగాలలో పోటీలను నిర్వహించనున్నట్లు, మొత్తంగా 49 విభాగాల పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శనతో విజేతలుగా నిలిచిన వారికీ బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, ప్రముఖ చరిత్రకారులు, గిరిజన తెగల యోధులు, ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలతో సీనియర్ విభాగం నాటిక పోటీల ప్రదర్శన కొనసాగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజన తెగల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో ప్రాణత్యాగాలు చేసిన యోధుల జీవితగాధలు, గిరిజన సంక్షేమం కోసం, సామాజిక దురాచారాలు రూపమాపటానికి పాటుపడిన మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలోని అనేక ఘట్టాలను అప్పటి పరిస్థితులను వివరించేలా సెటింగ్స్, వస్త్రధారణతో ప్రదర్శనలు ఆధ్యంతం కొనసాగాయి. ఆంద్రప్రదేశ్ నుండి లక్ష్య సాధనలో ఏకాగ్రత, గురు భక్తి ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో, అసాధారణ శ్రద్ధ, స్వాధ్యాయం ఉంటే, అత్యల్ప అవకాశాలు ఉన్నవారు సైతం ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని తెలియజేసే ఇతిహాసగాధ మహాభారతం నుంచి ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు కథాంశంతో ఆంధ్రప్రదేశ్ ఈఎంఆర్ఎస్ విద్యార్థుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గురువు మీద అత్యంత భక్తితో కఠిన సాధనతో అభ్యసించిన విలువిద్యను తృణప్రాయంగా గురువుకు దక్షిణగా అందించిన ఏకలవ్యుని త్యాగనిరతని చిన్నారులు ఎంతో హృద్యంగా కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు.

అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు ప్రముఖ రాజకీయ నాయకులు, చరిత్ర కారుల జీవిత వృత్తాంతాలు, సామజిక సమస్యలపై నాటిక రూపంలో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. తెలంగాణ నుండి దేశ సరిహద్దులలో పహాల్గమ్ దాడిలో మరణించిన వారికీ నివాళిగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ మురళి నాయక్ జీవిత చరిత్రని, పోరాట పటిమని నాటిక రూపంలో అద్భుతమైన ప్రదర్శనను ఇవ్వటంతో ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగడమే కాకుండా పోరాట స్ఫూర్తిని, దేశ భక్తిని చాటారు. అంతే కాకుండా మహారాష్ట్ర నుండి విద్య ప్రాముఖ్యతను, అందులోనూ ముఖ్యంగా మహిళకు చదువు ఎంత ముఖ్యమన్నది జ్యోతిభా పూలే, సావిత్రిభా పూలే జీవిత కథను నాటిక రూపంలో వీక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించారు. ఛత్తీస్గఢ్ నుండి మద్యపానం నిషేధమనే సామజిక అంశాన్ని ప్రజలను ఆలోంచింపచేసే విధంగా అద్భుత ప్రదర్శననిచ్చారు. హిమచల్ ప్రదేశ్ నుండి వారి రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి యశ్వంత్ సింగ్ పర్మార్ జీవిత చరిత్ర, ఒడిస్సా నుండి గిరిజన స్వాతంత్ర సమారయోధుడు సురేంద్ర సైరా ధీర గాధ, జార్ఖండ్ స్వాతంత్య్ర సమరయోధులు సంతల్ విద్రో పోరాటం, తమిళనాడు సాహిత్య లెజెండ్ కోనంగి జీవిత చరిత్ర నాటికలను ప్రదర్శించి చరిత్ర పుటలను స్పురణకు తెచ్చారు.ఈ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమీ, నెస్ట్ సహాయ కార్యదర్శి బిపిన్ రాటురి, రంపచోడవరం ఐటిడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరన్ రాజ్, ఇతర గిరిజన సంక్షేమ శాఖ, ఎన్ఈఎస్టీఎస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

కేఎల్ యూనివర్సిటీలో రెండోరోజు ఉద్భవ్-2025 సందడి - Tholi Paluku