Let's talk: editor@tmv.in
కేంద్రం విద్యా విధానాన్ని వ్యాపారంగా మార్చింది: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

కేంద్రం విద్యా విధానాన్ని వ్యాపారంగా మార్చింది: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Gaddamidi Naveen
16 జులై, 2026

దేశంలో విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో నిర్వహించిన “ఛత్రోంకి గూంజ్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఉద్యోగాలు, విద్యా ప్రవేశాలకు సంబంధించిన పోటీ పరీక్షల పేపర్లు తరచూ లీక్ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాల కారణంగా విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్ సహా పలు పరీక్షలలో చోటుచేసుకున్న లీకేజీ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ “ఛత్రోంకి గూంజ్” కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
MaheshKumarGoudBalmoorVenkatChhatronKiGoonjRahulGandhiNEETNEETPaperLeakEducationSystemStudentRightsYouthVoiceExamReformsDharmendraPradhan