Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కృతజ్ఙత లేని వారి ఓట్లు మాకొద్దు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

కృతజ్ఙత లేని వారి ఓట్లు మాకొద్దు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

Pinjari Chand
20 అక్టోబర్, 2025

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. అర్వాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సమాజంపై విమర్శలు గుప్పించారు. ఈసందర్భంగా సింగ్ మాట్లాడుతూ నేను ముస్లింలను అడిగాను, ఆయుష్మాన్ కార్డు వచ్చిందా? అని అడిగాను, వారు వచ్చింది అన్నారు. హిందూ–ముస్లిం సమస్యలేదా? అని అడిగాను, లేదన్నారు. దేవుడి పేరుతో ఓట్లడిగితే మీరు ఓటు వేస్తారా? అన్నాను, లేదన్నారు. అప్పుడు నేను అన్నాను నాకు ‘నమక్ హరామ్’ (కృతజ్ఙత లేని)ల ఓట్లు అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గతంలో పేదరిక నిర్మూలన నినాదం ఇచ్చింది. లాలూ యాదవ్ ఇచ్చారు. కానీ దేశంలో పేదరిక నిర్మూలన చేసిందెవరు? మీరు ఆలోచించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. అలాగే గిరిరాజ్ సింగ్ బీహార్‌లో అభివృద్ధి, మహిళల భద్రత అంశాలను కూడా ప్రస్తావించారు. ఇప్పటి బీహార్ పూర్తిగా మారింది. నా కుమార్తె రాత్రివేళ బయటికి వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విజయమే అని కొనియాడారు. 2010లో జేడీయూ–బీజేపీ కలసి 206 సీట్లు గెలిచాయి. ఈసారి ఆ రికార్డును మించిపోతాం. మహాగఠ్‌బంధన్ ఇక థగ్‌బంధన్ అయిపోయింది అని పేర్కొన్నారు.

గిరిరాజ్ సింగ్ హద్దులు దాటుతున్నారు

ముస్లింలపై గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్ భాషా హద్దులు దాటుతోంది. ఎవరు బ్రిటిష్ వారికి మద్దతునిచ్చారో ఆయన గుర్తు చేసుకోవాలన్నారు.

హిందూవులను కూడా అంటారా? శివసేన నాయకుడు సంజయ్ రౌత్

ఒక సమాజాన్ని ‘నమక్ హరామ్’ అని పిలవడానికి ఒక మంత్రిగా ఆయనకు హక్కెవరు ఇచ్చారు ? ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా బీజేపీకి ఓటు వేయని రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ లో కూడా బీజేపీకి ఓటేయని వారు ఉన్నారు. వారిని కూడా ‘నమక్ హరామ్’ అంటారా? అని ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ వెంటనే గిరిరాజ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న అలాగే ఫలితాలు నవంబర్ 14 వెలువడతాయి.

కృతజ్ఙత లేని వారి ఓట్లు మాకొద్దు: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ - Tholi Paluku