Let's talk: editor@tmv.in
కూతురు ప్రేలాపన.. ‘కొండా’కు ఉద్వాసన

కూతురు ప్రేలాపన.. ‘కొండా’కు ఉద్వాసన

Pinjari Chand
4 సెప్టెంబర్, 2026

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేగింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, దేవాదాయ, అటవీశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలన్న సీఎం ఆదేశాలతో ప్రభుత్వం లోక్‌భవన్‌కు ఉత్తర్వులు పంపింది. గవర్నర్‌‌ కూడా ఆమోదించారు. దీంతో ఇప్పటి వరకు సురేఖ విషయంలో జరిగిన రాజకీయ పరిణామాలకు తెరపడింది. అలాగే ఆమెతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి నియామాకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇద్దరు నాయకులు ఏ రకంగా స్పందిస్తారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. పార్టీ లైన్‌ దాటడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తల్లి పదవి కోల్పోవడం, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడంతో చిన్నారెడ్డి కూడా పదవీచిత్యుడు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కూతురు తెచ్చిన తంటా

కొండా సురేఖ, మురళీలకు ఏకైక సంతానం కొండా సుస్మితా పటేల్‌. ఈమె మొదటి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డిపై అగ్రెసివ్‌గానే స్పందిస్తున్నారు. మంత్రి సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ అవినీతి చేశారని అరెస్ట్‌ చేయడానికి వచ్చినప్పుడు కూడా పోలీసుల ముందే రేవంత్‌రెడ్డికి సుస్మితా సవాల్‌ విసిరింది. తమను పార్టీలో ఎదగకుండా, అలాగే తమ పదవుల వ్యవహరాల్లో వేళ్లు పెడుతున్నారని సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌‌రెడ్డి తదితరులను టార్గెట్‌ చేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. తదనంతరం వేగంగా జరిగిన పరిణామాలు, కొండా సురేఖ సీఎంకు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అయితే తాజా వివాదానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణమని సుస్మితా ఆరోపిస్తూ ఏకవచనంతో సీఎంపై పదునైన విమర్శలను ఎక్కుపెట్టింది. కట్టడి చేయాల్సిన తల్లిదండ్రులు కూతురిపై అతి గారాబంతో పదవీ ఉద్వాసన వరకు తెచ్చుకున్నారని పోలిటికల్‌ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుత వివాదం ఎక్కడ మొదలైందంటే..

ఆగష్టు 16న పరకాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాశ్‌రెడ్డే అభ్యర్థిగా ఉంటారన్నట్లు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి బరిలో ఉందామనుకున్న సుస్మితాకు ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టినట్లయింది. దీంతో ఆగష్టు 19న తన తల్లి కొండా సురేఖ పుట్టిన రోజున గీసుకొండలో అభిమానుల మధ్య జరిగిన సమావేశంలో సీఎంపై తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. ముందుగానే పరకాల టికెట్‌ ప్రకటించడానికి నీవెవరివి? దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలిచి నీనెంటో చూపిస్తా’ అని సవాల్‌ విసిరారు. అలాగే రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని, అహంకారం మితిమీరిపోయిందని, సొదరులు అవినీతికి పాల్పడుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, సూమరు రూ.200 కోట్ల విలువైన భూమిని అప్పగించి తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు కొండా కుటుంబం అండగా నిలబడిందని, మా నాన్నకు ఎమ్మెల్సీ ఇస్తామని నేటికి ఇవ్వలేదని, కనీసం సీఎంను కలుద్దామంటే అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

క్రమశిక్షణా కమిటీ వేసిన పార్టీ.. వేగంగా పరిణామాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన నుంచి తిరిగివచ్చిన​ అనంతరం వేగంగా రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారాయి. కొండా సుస్మితా తీవ్రంగా మాట్లాడతున్న సురేఖ కూతురుని కట్టడి చేయకపోవడం, ఆమె మాటలను ఖండించకపోవడం, పైగా ఆమెకు మాకు సంబంధం లేదని చెప్పడంతో రేవంత్‌రెడ్డి మరింత సీరియస్‌ అయ్యారు. పార్టీ పరంగా ఎంపీ మల్లురవి సారథ్యంతో క్రమశిక్షణా కమిటీని వేసింది. విచారణ అనంతరం మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించాలన్న నివేదికను టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌‌ గౌడ్‌కు అందజేశారు. నిర్ణయం తీసుకోవడంలో మల్లాగుల్లాలు పడుతుండడంతో పంచాయతీ ఢిల్లీ అధిష్టానానికి చేరింది. దీర్ఘమైన చర్చలు.. నాయకులతో మంతనాల అనంతరం ఆమెపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌‌కు సిఫారసు చేయడం జరిగింది. రాఖీ పౌర్ణమి రోజున కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి రాజీ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. పండగ పండగే.. చర్యలు చర్యలే అన్న తీరుగా నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తానికి కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లికి పదవి ఉద్వాసనం జరిగింది. అయితే కొండా సురేఖ, చిన్నారెడ్డి పై వేటు వేసిన ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మిని, తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌‌పర్సన్‌గా నెరెళ్ల శారదను, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) చైర్‌‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని నియమించింది.

కూతురు ప్రేలాపన.. ‘కొండా’కు ఉద్వాసన - Tholi Paluku