
కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం: ఉపముఖ్యమంత్రి
రాష్ట్రంలో వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూటమికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు తీసుకురాకపోతే పదవులకు నిష్ప్రయోజనమని ఆయన అన్నారు. ఈ కృషిని కూటమి ఐక్యతను మరో 15 ఏళ్లు ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ)ను ప్రారంభించిన అనంతరం ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పాలనలో సంస్కరణలు.. ఉద్యోగులకు ఊరట
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే నిష్ప్రయోజనమే అని స్పష్టం చేశారు.గత అయిదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన పరిణామాలను మదింపు చేసి, నూతన సంస్కరణలతో జీ వో నంబరు 57, 58ను అనుసరించి ఈ కార్యాలయాలను తీసుకొచ్చామని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే ఏళ్ల నుంచి పదోన్నతులకు నోచుకోని సుమారు 10 వేల మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు అర్హత ఆధారంగా పైరవీలకు తావు లేకుండా పదోన్నతులు కల్పించామని అన్నారు.
మన ఐక్యతే రాష్ట్రానికి బలం.. అరాచకాలు ఉండకూడదు
మన ఐక్యతే రాష్ట్రానికి బలం అని పేర్కొంటూ కూటమిలోని మూడు పార్టీలకు విభిన్న భావజాలాలు ఉన్నా రాష్ట్రం బాగుండాలి అరాచకాలు ఉండకూడదు" అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చామన్నారు. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉంటే కలిసి మాట్లాడుకుంటే తీరుతాయన్నారు. ఇదే ఐక్యతతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన శక్తిగా మారామని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామని తెలిపారు.
అవినీతిని అరికట్టి.. బలహీనుల గొంతుకగా మారాలి
గత పాలనలో శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారని ఇప్పటివరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమేనని, ఆ విలువ వేల కోట్లలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అరాచక శక్తులను నిలువరించి, అవినీతిని అరికట్టి, బలహీనుల గొంతుకగా మారాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికల్లో భయపెట్టాలని చూసినా, జనసేన కార్యకర్తలు ప్రాణాలకు తెగించి నిలబడ్డారని గుర్తుచేశారు. సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడమే జనసేన ముఖ్య లక్ష్యమని చెబుతూ, కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని గుర్తింపు ఇస్తామని, గ్రామ స్థాయి నుంచి లోక్సభ వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
సమావేశానంతరం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛరథాలను' పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన రథాల పనితీరును తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొచ్చిన ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించి, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షు డు తదితరులు పాల్గొన్నారు.
