Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కుంభమేళా తరహాలో మేడారం జాతర: సీఎం రేవంత్ రెడ్డి

కుంభమేళా తరహాలో మేడారం జాతర: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
19 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన 'మేడారం సమ్మక్క–సారలమ్మ' జాతరను ఉత్తరాదిలో జరిగే కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ములుగు జిల్లాలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మల పట్ల తన భక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, మేడారంలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.

సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ కాకతీయ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి, ధైర్యం ద్వారా దైవత్వాన్ని పొందిన వీర వనితలుగా చరిత్రలో నిలిచారని సీఎం గుర్తుచేశారు. ఈ జాతర త్యాగం, ధైర్యం, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే తాను పాదయాత్ర ప్రారంభించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సంకల్పించానని, సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

మేడారం అభివృద్ధి తనకు లభించిన అదృష్టమని పేర్కొన్న సీఎం, జాతర ప్రారంభానికి ముందే 100 రోజుల్లో అభివృద్ధి పనులు, శాశ్వత రాతి నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్‌

మేడారం మహా జాతర'కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మల ఆలయాన్ని (గద్దెలను) అధికారికంగా ప్రారంభించారు. తన కుటుంబ సభ్యులు, కేబినెట్ సహచరులతో కలిసి ఆయన వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గిరిజన సాంప్రదాయం ప్రకారం, సీఎం తన మనవడితో కలిసి తన బరువుకు సమానమైన "బంగారాన్ని" (బెల్లం) అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు.ఇది భక్తి, శ్రేయస్సు, గౌరవానికి ప్రతీకగా భావిస్తారు.

జాతర ప్రారంభానికి ముందే, ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సుమారు వేయి ఏళ్ల గిరిజన వీరగాథను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత సుందరంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ పునర్నిర్మాణం గిరిజన వారసత్వానికి దక్కిన గౌరవమని, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రూ. 101 కోట్లతో పునర్నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 101 కోట్ల వ్యయంతో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలను పునర్నిర్మించింది. వీటితో పాటు, జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా జాతర 2026కు వచ్చే భక్తుల సౌకర్యార్థం మరో రూ. 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసింది.

కుంభమేళా తరహాలో ఏర్పాట్లు

అధికారిక వర్గాల ప్రకారం, ఈ ఏడాది మహాజాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేసింది. 21కు పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 42,000 మందికి పైగా సిబ్బందిని విధుల్లోకి దింపనున్నారు. అదనంగా, సుమారు 2,000 మంది గిరిజన యువత స్వచ్ఛంద సేవకులుగా సేవలందించనున్నారు.

సమ్మక్క–సారలమ్మ మహాజాతర ధైర్యం దైవత్వంగా మారిన చారిత్రక ఘటనకు ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో తీవ్ర కరువు సమయంలో గిరిజనులపై విధించిన పన్నులకి వ్యతిరేకంగా సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ చేసిన పోరాటమే ఈ జాతరకు మూలమని గుర్తుచేశారు. 12వ శతాబ్దంలో జరిగిన ఈ తిరుగుబాటు గిరిజనుల ఆత్మగౌరవం, స్వాతంత్ర్య తపనకు చిహ్నంగా నిలిచిందన్నారు. ఎటూర్నాగారం అటవీ అభయారణ్యంలో, దండకారణ్యంలోని సుదూర ప్రాంతమైన మేడారంలో జరిగే ఈ మహాజాతర సమయంలో గిరిజన దేవతలు తమ ప్రజలను దర్శించేందుకు వస్తారని విశ్వాసం. ఆ విశ్వాసానికి తగిన గౌరవం కల్పిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాజాతరను విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైవార్షిక గిరిజన పండుగ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందు ఈ ఆలయాల అభివృద్ధి పనులు పూర్తికావడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

కుంభమేళా తరహాలో మేడారం జాతర: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku