
కీరవాణి రాగంలో.. రిపబ్లిక్ డే వేడుకలు
ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కీరవాణి స్వరాలు వినిపించనున్నాయి. అలాగే భారతదేశంలోని వివిధ నృత్య రూపాలను ప్రతిబింబించేలా సుమారు 2,500 మంది కళాకారులు ఈ ఏడాది 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ పై భారీ సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ పరేడ్ ప్రధాన థీమ్ ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం (సెస్క్విసెంటెనరీ)గా ఉంటుంది. ఈ సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించిన విస్తృత థీమ్‌లు ‘స్వతంత్ర కా మంత్ర – వందే మాతరం’,‘సమృద్ధి కా మంత్ర – వికసిత్ భారత్’గా ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం రూపొందించిన సృజనాత్మక బృందంలో ఎం.ఎం. కీరవాణి – సంగీత దర్శకుడు, సుభాష్ సెహగల్ – గీత రచయిత, అనుపమ్ ఖేర్ – వ్యాఖ్యాత (నేరేటర్), సంతోష్ నాయర్ – నృత్య దర్శకత్వం (కోరియోగ్రాఫర్) వీరి సమగ్ర పర్యవేక్షణ, దర్శకత్వ బాధ్యతలను సంధ్య పురేచా నిర్వర్తిస్తున్నారు. వేదిక డిజైన్, వేషధారణ బాధ్యతలను సంధ్య రామన్ నిర్వహిస్తారని అధికారులు చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు సంగీతం అందించి 2023లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఎం.ఎం. కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందారు. రక్షణ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల బ్రీఫింగ్‌లో, ఈ సాంస్కృతిక కార్యక్రమ బృందంలో కీరవాణి భాగమని ఇప్పటికే ప్రకటించింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ 2,500 మంది కళాకారులు భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, కూచిపూడి, మణిపురి వంటి భారతదేశంలోని ప్రముఖ నృత్య శైలులను ప్రదర్శించనున్నారు.
కీరవాణి సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే అవకాశం దక్కడం నాకు గర్వకారణం. దేశం నలుమూలల నుంచి వచ్చిన 2,500 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. దేశభక్తి స్ఫూర్తిని కలిసి జరుపుకుందామని పేర్కొన్నారు. థీమ్‌కు అనుగుణంగా, కర్తవ్య పథ్ వెంట ఉన్న ఎంక్లోజర్ల వెనుకభాగాల్లో ‘వందే మాతరం’ ప్రారంభ పంక్తులను ప్రతిబింబించే పాత చిత్రాలు, ప్రధాన వేదిక వద్ద గీత రచయిత బంకిమ్ చంద్ర చటోపాధ్యాయకు నివాళులర్పించే పుష్ప అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు.
ఈసారి సంప్రదాయానికి భిన్నంగా, పరేడ్ వేదిక వద్ద గతంలో ఉపయోగించిన ‘వీవీఐపీ’, ఇతర హోదా సూచించే లేబుళ్లు ఉపయోగించరు. బదులుగా, అన్ని ఎన్ క్లోజర్లకు భారత నదుల పేర్లు పెట్టారు.వీటిలో బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చేనాబ్, గండక్, గంగా, ఘాఘ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, కృష్ణ, మహానది, నర్మద, పెన్నార్, పెరియార్, రావి, సోన్, సట్లెజ్, తిస్సా, వైగై, యమునా వంటి నదుల పేర్లు ఉన్నాయి. అలాగే జనవరి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ కార్యక్రమానికి, ఎన్ క్లోజర్లకు భారతీయ సంగీత వాయిద్యాల పేర్లు – బాన్సూరీ, డమరు, ఎక్తారా, ఎస్రాజ్, మృదంగం, నాగడ, పఖవాజ్, సంతోర్, సారంగి, సారిందా, సరోద్, శహనాయి, సితార్, సుర్‌బహార్, తబ్లా, వీణ గా నామకరణం చేశారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయెన్ రాక
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆహ్వాన పత్రాలపై ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవ లోగోను ముద్రిస్తారు. పరేడ్ ముగింపులో ‘వందే మాతరం’ థీమ్‌తో ఉన్న బ్యానర్‌ను మోస్తూ బెలూన్లు గాల్లోకి విడిచిపెడతారని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ తెలిపారు. జనవరి 19 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాల్లో, సుమారు 235 ప్రాంతాల్లో సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, కోస్ట్ గార్డ్, కేంద్ర సాయుధ బలగాల బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించి జాతీయ గీతానికి వందనం అర్పిస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నైహాటీలో ఉన్న బంకిమ్ చంద్ర చటోపాధ్యాయుల జన్మస్థలం, పూర్వీకుల నివాసం (బంకిమ్ భవన్) వద్ద కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సామాన్యులకు ఆహ్వానం
ఈ ఏడాది కర్తవ్య పథ్‌లో జరిగే వేడుకలను వీక్షించేందుకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో ఉపాధి సృష్టి, సాంకేతికత, స్టార్టప్‌లు, స్వయం సహాయక సంఘాలు, ఐఎస్ఆర్వో గగన్ యాన్, చంద్రయాన్ వంటి మిషన్లలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ విజేతలు, సహజ సాగు చేసే రైతులు, పీఎం–స్మైల్ పథకం కింద పునరావాసం పొందిన ట్రాన్స్‌జెండర్లు, భిక్షాటన నుంచి బయటపడ్డ వ్యక్తులు, ‘మన్ కీ బాత్’ పాల్గొనేవారు ఉన్నారు. ఈ ప్రత్యేక అతిథులకు కర్తవ్య పథ్ వెంట ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాట్లు చేస్తారు. అలాగే నేషనల్ వార్ మెమోరియల్, ప్రధాన్ మంత్రి సంగ్రహాలయం తదితర ప్రదేశాల సందర్శన ఏర్పాట్లు కూడా చేస్తారు. కొంతమంది కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం కూడా వారికి కల్పిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
