
కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి: సోనియాగాంధీ
ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన సోనియా గాంధీ కాలుష్య నివారణ కోసం ఏదో ఒక చర్య తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కాలుష్యం వల్ల చిన్న పిల్లలు బాధపడుతున్నారు. నా లాంటి వృద్ధులకు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని అన్నారు.
ప్రతి సంవత్సరం గాలి నాణ్యత పడిపోతోంది
కాంగ్రెస్ ఎంపీ ప్రియంక గాంధీ వాద్రా కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. కాలుష్య నివారణ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు అనుకోవడం లేదని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటే కేంద్రంతో కలిసి నిలబడతామని ఆమె చెప్పారు. ఏ వాతావరణ సౌందర్యాన్ని ఆస్వాదించాలి? బయట పరిస్థితి చూడండి. సోనియా జీ చెప్పినట్టు పిల్లలు సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఆమెకు ఆస్తమా ఉంది, ఆమె లాంటి వృద్ధులు శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రతి ఏటా కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తారు. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని, అందరం ప్రభుత్వంతో నిలబడతామని చెప్పాం. ఇది ఒకరిపై ఒకరు వేలుచూపే రాజకీయ అంశం కాదని ప్రియాంక అన్నారు.
ప్రధాని మోడీ కి కౌంటర్
ఈ రోజు ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తర భారత భాగాల్లో గాలి కాలుష్యంపై కేంద్రంపై నిరసన తెలియజేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మకర్ ద్వార్ ఎదుట ధర్నా చేశారు. ఆక్సిజన్ మాస్క్లు ధరించి, ప్రధాని నరేంద్ర మోడీపై కౌంటర్లు వేస్తూ ‘మౌసమ్ కా మజా లీజియే’ (వాతావరణ సౌందర్యాన్ని ఆస్వాదించండి) అని రాసిన బ్యానర్ పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు. వింటర్ సెషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ఇదే మాట అన్న నేపథ్యంలో ఈ బ్యానర్ ను ప్రదర్శించారు. గాలి కాలుష్యంపై పార్లమెంటులో చర్చ జరపాలని నినాదాలు చేస్తూ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పార్లమెంటు భవనం బయట జరిగిన ఈ నిరసనలో పాల్గొన్నారు. వింటర్ సెషన్ నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీలు మణికం ఠాగూర్, మనీష్ తివారీ, విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఉత్తర భారతంలో గాలి నాణ్యతపై చర్చించేందుకు నోటీసులు ఇచ్చారు. కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని కోరారు.
