Let's talk: editor@tmv.in
కాలువల్లో నీళ్లకు బదులు తుమ్మ చెట్లు.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు ‘సెల్ఫీ ఛాలెంజ్’

కాలువల్లో నీళ్లకు బదులు తుమ్మ చెట్లు.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు ‘సెల్ఫీ ఛాలెంజ్’

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువల పనులు నిలిచిపోయాయని, దీంతో రైతాంగం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి నర్సాపూర్ నియోజకవర్గంలోని నిలిచిపోయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం కాలువ పనులను ఆయన గురువారం పరిశీలించారు.

రెడ్డిపల్లి వద్ద ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి నిలిచిపోయిన కాలువ పనుల వద్ద నిలబడి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ‘సెల్ఫీ ఛాలెంజ్’ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఈ కాలువ దుస్థితే నిదర్శనమని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ ప్యాకేజీ 18, 19 కింద నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు హరీశ్ రావు తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్‌ను అనుసంధానించే 18 కిలోమీటర్ల టన్నెల్‌లో దాదాపు 85 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, కేవలం 300 మీటర్ల పని మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. మిగిలిన ఈ చిన్న పనిని పూర్తి చేస్తే గోదావరి జలాలు కాలువ ద్వారా హల్దీ వాగులోకి చేరి, అక్కడ నుంచి నిజాం సాగర్ వ్యవస్థకు చేరుకుంటాయని.. దీనివల్ల మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కేవలం రూ. 50 కోట్లు కేటాయిస్తే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కింద మరో 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయ‌న తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాపై నిర్లక్ష్యం

రాజకీయ కారణాలతోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. మొన్న సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సలహాలు ఇచ్చారే తప్ప, జిల్లాలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల ఊసెత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదని, కనీసం ఒక్క రూపాయి నిధులైనా విడుదల చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ హల్దీ, మంజీరా వాగుల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యామ్‌లు మత్తడి దుంకాయి. ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. కట్టిన ఇల్లు పుణ్యానికి పోయేలాగా.. అందంగా తీర్చిదిద్ది ఇచ్చిన రాష్ట్రాన్ని నడపడం కూడా రేవంత్ రెడ్డికి చేతకావడం లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఘనపూర్ బ్యారేజీ ఎత్తు పెంపు పనులను, దుబ్బాకలో 80 శాతం పూర్తయిన ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని కోరారు. ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నందున మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. తాను తీసుకున్న సెల్ఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తున్నానని, ఇది ప్రభుత్వ అలసత్వానికి సజీవ సాక్ష్యమని పేర్కొంటూ.. ఇప్పటికైనా నిలిచిపోయిన కాలువలు, టన్నెల్ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు.

కాలువల్లో నీళ్లకు బదులు తుమ్మ చెట్లు.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు ‘సెల్ఫీ ఛాలెంజ్’ - Tholi Paluku