Let's talk: editor@tmv.in
కార్మిక రంగంలో బ్రిక్స్ దేశాలకు అపార సహకార అవకాశాలు: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ
కార్మిక రంగంలో బ్రిక్స్ దేశాలకు అపార సహకార అవకాశాలు: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ

కార్మిక రంగంలో బ్రిక్స్ దేశాలకు అపార సహకార అవకాశాలు: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ

Gaddamidi Naveen
15 జులై, 2026

సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గౌరవప్రదమైన ఉపాధి వంటి రంగాలలో బ్రిక్స్ కూటమి దేశాల మధ్య పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం స్పష్టం చేశారు.నగరంలో ఘనంగా ప్రారంభమైన మూడు రోజుల 'బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమిట్-2026' ను ఆయన అధికారికంగా ప్రారంభించి ప్రసంగించారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిపితే ప్రపంచ మానవాళిలో దాదాపు సగభాగం ప్రాతినిధ్యం వహిస్తాయని, ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక శక్తిని కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మన ఆర్థిక వ్యవస్థలు నిరంతరం రూపాంతరం చెందుతున్న తరుణంలో.. సామాజిక భద్రత, నైపుణ్యాల పెంపు, ఏఐ గవర్నెన్స్, లేబర్ మొబిలిటీ (కార్మికుల వలసలు), గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడంలో మరింత లోతైన సహకారానికి గొప్ప సంభావ్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. జూలై 15న హైదరాబాద్‌లోనే జరగనున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశం ఈ సదస్సు నుంచి వచ్చే సిఫార్సులను నిర్దిష్ట విధానపరమైన సహకారంగా, ఆచరణాత్మక ఫలితాలుగా మార్చడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి వినూత్నమైన, అందరినీ కలుపుపోయే, మానవీయ కోణంతో కూడిన భవిష్యత్తు పని విధానాన్ని రూపొందించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పన, భారత వృద్ధి వ్యూహం

భారతదేశ వృద్ధి వ్యూహంలో ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉందని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశంలో దాదాపు 17 కోట్ల ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయని వెల్లడించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 2017లో 6 శాతంగా ఉండగా, అది 2025 నాటికి 3.1 శాతానికి తగ్గిందని, ఇదే కాలంలో మహిళా ఉపాధి రేటు 22 శాతం నుంచి గణనీయంగా 38.8 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' అనే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా రాబోయే రెండేళ్లలో ఫార్మల్ రంగంలో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

కార్మిక సంక్షేమ రంగంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. ప్రస్తుతం 8 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు, 80 లక్షల పెన్షనర్లు ఈ సంస్థ పరిధిలో ఉన్నారని తెలిపారు. అలాగే ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ద్వారా 15 కోట్లకు పైగా బీమా పొందిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా, సామాజిక భద్రతా సేవలు అందుతున్నాయని చెప్పారు.

ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ సంస్థలలో సామాజిక భద్రత పరిధిని విస్తరించడానికి, ప్రక్రియలను సులభతరం చేయడానికి, లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందించడానికి పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టామన్నారు. ఈ ప్రయత్నాల వల్ల భారతదేశంలో సార్వత్రిక సామాజిక రక్షణ పరిధి 2015లో 19 శాతంగా ఉండగా, 2025 నాటికి 64.3 శాతానికి విస్తరించి, సుమారు 94 కోట్ల మందికి రక్షణ కల్పించిందని చెప్పారు. 2026 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సామాజిక భద్రత రక్షణ పరిధి ఇప్పటికే 100 కోట్లు దాటిందని మంత్రి ప్రకటించారు.

భవిష్యత్తు పని విధానం వేగవంతమైన సాంకేతిక మార్పులపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 'స్కిల్ ఇండియా మిషన్' వంటి కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, రీ-స్కిల్లింగ్, నిరంతర అభ్యాసం పై భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. భారతదేశ జనాభా డివిడెండ్‌ను ఏఐ, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ ప్రతిభావంతుల పూల్‌గా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. నైతికమైన ఏఐ, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు, నిరంతర రీ-స్కిల్లింగ్, కార్మికులకు న్యాయమైన రక్షణ కల్పించడమే తమ విధానమని, సాంకేతిక పురోగతి ఎల్లప్పుడూ సామాజిక సమగ్రతతో కూడి ఉండాలని హితవు పలికారు.

భారతదేశ కార్మిక పాలనా యంత్రాంగం.. ప్రభుత్వం, యజమానులు, కార్మిక సంఘాల మధ్య ఉండే బలమైన త్రైపాక్షిక సామాజిక చర్చల సంప్రదాయంపై ఆధారపడి నిర్మించబడిందని మంత్రి వివరించారు. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీలతో పాటు కొత్త లేబర్ కోడ్‌ల కింద ఏర్పాటయ్యే జాతీయ సామాజిక భద్రతా బోర్డు, కేంద్ర సలహా బోర్డు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల సలహా బోర్డులన్నీ కూడా ఈ త్రైపాక్షిక విధానం ఆధారంగానే పనిచేస్తాయని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
BRICS2026BRICSSummitHyderabadMansukhMandaviyaLabourReformsEmploymentSocialSecuritySkillIndiaFutureOfWorkAIWorkforceDevelopment