Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కార్పొరేటర్లను హోటళ్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది?: సంజయ్ రౌత్

కార్పొరేటర్లను హోటళ్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది?: సంజయ్ రౌత్

Pinjari Chand
19 జనవరి, 2026

ఇటీవల జరిగిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల అనంతరం, అధికార కూటమి భాగస్వామి అయిన శివసేన (ఏకనాథ్ శిండే వర్గం) తమ కార్పొరేటర్లను హోటళ్లకు తరలించడంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా ప్రశ్నించారు. తాజా మున్సిపల్ ఎన్నికల తీర్పు ప్రకారం, మేయర్ పదవిని ఎవరూ సులభంగా దక్కించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. 227 మంది సభ్యులున్న బీఎంసీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు, ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన 29 సీట్లు గెలుచుకోగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 సీట్లు సాధించింది. వారి మిత్రపక్షమైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు సీట్లు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం, శివసేన (శిండే వర్గం) తమ 29 మంది కార్పొరేటర్లను ముంబైలోని ఒక హోటల్‌కు తరలించింది. ఇది దేశంలోనే అత్యంత సంపన్నమైన బీఎంసీ వంటి మున్సిపల్ సంస్థ పనితీరుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ‘ఓరియెంటేషన్ వర్క్‌షాప్’ కోసమేనని ఆ పార్టీ వెల్లడించింది. అయితే, బీజేపీకి మేయర్ పదవి దక్కాలంటే శిండే వర్గం సీట్లు కీలకంగా మారడంతో, మహాయుతి కూటమి వ్యూహంలో భాగంగానే ఈ తరలింపు జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

హస్యాస్పదంగా ఉంది

ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ శిండే ఇప్పటికే తన కార్పొరేటర్లను 5 స్టార్ హోటల్‌కు తరలించారు. వారిని జైళ్లో మాదిరి కట్టడి చేస్తున్నారు. నా సమాచారం ప్రకారం బీజేపీ కూడా తమ కార్పొరేటర్లను సురక్షిత స్థలానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసలు ఎవరు ఎవరికీ భయపడుతున్నారు? మీరు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరవుతూ, ఇక్కడ కార్పొరేటర్లను హోటళ్లకు తరలించడాన్ని చూస్తున్నారు. ఇది నిజంగా హాస్యాస్పదమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రౌత్, ముంబైలో కాంగ్రెస్‌ను ఓడించామని బీజేపీ చెబుతుండడం చరిత్రను విస్మరించినట్టేనని వ్యాఖ్యానించారు. గత 25 ఏళ్లుగా బీఎంసీపై (అవిభాజిత) శివసేన ఆధిపత్యం కొనసాగిందని, ముంబై రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యం చాలా పరిమితంగానే ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముంబైలోనే స్థాపించారని, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని రౌత్ చెప్పారు. ఆ చారిత్రక దశల్లో బీజేపీ అసలు అస్థిత్వంలోనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీఎంసీలో శివసేన (యూబీటీ) ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ, అటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని రౌత్ స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాలను గమనిస్తున్నాం. వాటిని ఆస్వాదిస్తున్నామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఫడ్నవీస్ ప్రధాని అవుతారేమో?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు స్విట్జర్లాండ్‌లో బీఎంసీ తదితర మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇచ్చిన ఘన స్వాగతంపై కూడా రౌత్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ స్వాగతం చూస్తే ఆయన ప్రధాని అవ్వబోతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. అయితే భవిష్యత్తులో ఒక మరాఠీ నాయకుడు ఆ పదవిని చేపడితే తాను గర్వపడతానని కూడా చెప్పారు. ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ఊహాగానాలను రౌత్ తోసిపుచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ శిండే థానే జిల్లాలోని కళ్యాణ్–డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కార్పొరేటర్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, అదే విధంగా ముంబైలో కూడా ప్రయత్నాలు చేయవచ్చని రౌత్ ఆరోపించారు. ఇంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మద్దతుతోనే ఏకనాథ్ శిండే శివసేనను చీల్చారని ఆయన ఆరోపించారు.

కార్పొరేటర్లను హోటళ్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది?: సంజయ్ రౌత్ - Tholi Paluku