
కామారెడ్డిలో మహిళా బీఎల్ఓపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు
కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్న ఒక మహిళా బూత్ స్థాయి అధికారిణి (బీఎల్ఓ) పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధులకు ఆటంకం కలిగించి, తనపై భౌతిక దాడికి దిగారంటూ సదరు మహిళా (42 ఏళ్ల) ప్రభుత్వ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 10న సదరు బీఎల్ఓ ఓటర్ల గణనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు మహిళలు ఆమె వద్దకు వచ్చి ఓటరు నమోదు ఫారమ్‌ను సమర్పించారు. అయితే, ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారిణి.. దానిపై ఫోటో అతికించకపోవడాన్ని గమనించారు. ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించగా.. దరఖాస్తుదారురాలైన మహిళ తాను 'బంగ్లాదేశ్' కు చెందినదాన్నని, అందుకే ఫోటో పెట్టనని సమాధానం ఇచ్చింది. దాంతో ఆ ఫారమ్‌ను స్వీకరించేందుకు బీఎల్ఓ నిరాకరించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు మహిళలు అధికారిణిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, వెనక్కి నెట్టేసి విధులకు ఆటంకం కలిగించారు. అంతేకాకుండా, అక్కడికి వచ్చిన మరో వ్యక్తి.. బంగ్లాదేశ్ ప్రస్తావన తెస్తూ ఫారమ్‌ను ఎందుకు తిరస్కరించావని బీఎల్ఓను నిలదీశాడు. ఆ దరఖాస్తును అంగీకరించకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ గొడవలో నిందితులు ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని ధ్వంసం చేయడమే కాకుండా, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 'భారతీయ న్యాయ సంహితసలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్నట్లు దరఖాస్తు సమర్పించిన మహిళ నిజంగానే బంగ్లాదేశీయురాలా? అని పోలీసులను ప్రశ్నించగా.. అయితే ఫారమ్ సమర్పించిన మహిళ బంగ్లాదేశ్‌కు చెందినదని వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆమె భారతీయురాలేనని స్పష్టం చేశారు. తెలంగాణలో జూన్ 25న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది.
