Let's talk: editor@tmv.in
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై పవన్ కళ్యాణ్ సమీక్ష

కాకినాడ జిల్లాలో పులి సంచారంపై పవన్ కళ్యాణ్ సమీక్ష

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పులి కదలికలపై అటవీ శాఖతో పాటు ‘హనుమాన్‌’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే పులికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పులి సంచారం నేపథ్యంలో అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేలా రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన భద్రతా సూచనలు అందించాలని ఆదేశించారు.