
కాంగ్రెస్ నేతలపై అసభ్య వీడియోలు.. ఇద్దరిపై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారన్న ఆరోపణలపై ఇద్దరు ఖాతాదారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. తన ఫిర్యాదులో.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలను ‘ఎక్స్’లో పోస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోలను భారత్ మ్యాట్రిక్స్ (@xBharat), భాస్కర్ శాస్త్రి (@Bhajos1S97051) పేర్లతో ఉన్న ఖాతాల నుంచి పోస్టు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి చెందుతోందని వెంకట్ బల్మూర్ ఆరోపించారు. వీడియోల అసలు స్వరూపం, వాటి సృష్టి, ప్రసారం వెనుక ఉన్న వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 27న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం దారుణం: యువ కాంగ్రెస్
కాంగ్రెస్ మహిళా నేతలు, దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు చర్య అని భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ విమర్శించారు. అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారాన్ని ఏమాత్రం సహించబోమని, సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు, ముఖ్యంగా సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నకిలీ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టం ముందు నిలబెడతామని యువ కాంగ్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
