Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కవిత కొత్త పార్టీపై కసరత్తు… ప్రశాంత్ కిషోర్‌‌‌తో చర్చలు

కవిత కొత్త పార్టీపై కసరత్తు… ప్రశాంత్ కిషోర్‌‌‌తో చర్చలు

Gaddamidi Naveen
19 జనవరి, 2026

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభంపై అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌‌తో ఆమె చర్చలు జరిపినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు సోమవారం వెల్లడించాయి.

తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్న కవిత, ఇటీవల ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో ఉన్న ప్రశాంత్ కిషోర్‌‌తో పలు దఫాలుగా సమావేశమైనట్లు సమాచారం. బీహార్ కేంద్రంగా పనిచేస్తున్న జన సురాజ్ పార్టీ స్థాపకుడైన ప్రశాంత్ కిషోర్‌‌తో కొత్త పార్టీ ఏర్పాటు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకున్నారని వర్గాలు తెలిపాయి.

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయిన కవితను 2025 సెప్టెంబరులో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తన తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ ఆమె, బీఆర్ఎస్ నేతలు టీ. హరీష్‌రావు, జే. సంతోష్‌కుమార్‌లపై ఆరోపణలు చేయడం ఈ చర్యకు కారణమైంది. సస్పెన్షన్ అనంతరం కవిత తెలంగాణ జాగృతి వేదికగా ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. అదే సమయంలో ఆమె శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఆ రాజీనామాను ఈ నెల ఆరంభంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే గత బీఆర్ఎస్ పాలనలోనూ అవినీతి, అక్రమాలు జరిగాయని కవిత తీవ్రంగా విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్యాయాలపై తాను ఒక రోజు ముఖ్యమంత్రి అయిన త‌రువాత‌ విచారణ జరిపిస్తానని గతేడాది డిసెంబరులో ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని కూడా స్పష్టం చేశారు.

ఇటీవల బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని “జోక్”గా అభివర్ణించిన కవిత, గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలకు తాను బాధ్యత వహించనని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే, తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీతో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కవిత కొత్త పార్టీపై కసరత్తు… ప్రశాంత్ కిషోర్‌‌‌తో చర్చలు - Tholi Paluku