
కవిత కొత్త పార్టీ ప్రకటన: మే తొలి వారంలో ముహూర్తం
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె కీలక ప్రకటన చేస్తూ, మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తన పార్టీ వ్యక్తుల చుట్టూ కాకుండా, బలమైన వ్యవస్థల మీద నడవాలని, సైద్ధాంతిక పునాదులతో ప్రజల్లోకి వెళ్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
పోటీ చేసే స్థానాలు: సిద్దిపేట వైపే మొగ్గు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీ గురించి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మొదటి ఛాయిస్ సిద్దిపేట అని, ఒకవేళ అది కుదరకపోతే రెండవ ఛాయిస్‌గా బోధన్ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని, తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని ఆమె పేర్కొన్నారు. కేవలం అసెంబ్లీ మాత్రమే కాకుండా.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత నిప్పులు చెరిగారు. "గతంలో కేబినెట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లేది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోంది.. రెండింటికీ తేడా లేదు" అంటూ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, పెండింగ్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ కంటే దారుణంగా ఉందని విమర్శించారు. రెండేళ్లలో ఆర్టీసీలో ఒక్క శాశ్వత నియామకం కూడా జరగలేదని దుయ్యబట్టారు. కొత్త తరహా రాజకీయాలు చేస్తామన్న కాంగ్రెస్, పాత పద్ధతులనే అవలంబిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ వాదమే పునాది: కొత్త తరానికి ప్రాధాన్యం
తమ పార్టీలో వారసత్వ రాజకీయాలకు తావులేకుండా, కొత్త తరానికి పెద్దపీట వేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సామాన్యులు ఎలాగైతే కేంద్ర మంత్రులయ్యారో, తన పార్టీలో కూడా కింది స్థాయి నాయకులకు అలాంటి అవకాశాలే వస్తాయన్నారు. 'తెలంగాణ వాదమే' తన పార్టీకి మొదటి ప్రాధాన్యతని, ప్రాంతీయ పార్టీలు కేవలం నేతల చుట్టూ తిరగకుండా పటిష్టమైన నిర్మాణం కలిగి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. వైఎస్ షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించలేదని, కానీ తాను ఇక్కడి మట్టి మనిషినని గుర్తుచేశారు.
కేటీఆర్, బీఆర్ఎస్ వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారని, అటువంటి వారిని పక్కన పెట్టుకుని ఉద్యమకారుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. ఆడవాళ్లు పార్టీ పెడితే తక్కువ చేసి చూడవద్దని, తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చిరంజీవి వంటి వారు పార్టీలు పెట్టి మూసివేసినా, తాను మాత్రం మొండిగా ముందుకు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
