Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కళలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వం బాధ్యత

కళలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వం బాధ్యత

FL - SUNL
20 అక్టోబర్, 2025

భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి మార్గదర్శకమైన కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక, కళారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం విజయనగరం జిల్లా రాజాంలోని వస్త్రపురి కాలనీలో జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రంను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాటక సమాజాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కళాకారులకు ఏ సౌకర్యం కల్పించాలన్నా సంబంధిత డేటా బ్యాంకు ఉపయోగపడుతుందన్నారు. కళారంగం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఈ సందర్భంగా రాజాం శాసనసభ్యులు కోండ్రు మురళి కళాకారుల అభ్యున్నతి కోసం అందించిన ప్రతిపాదనలు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో కళారంగం అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని స్థానిక నాయకులకు, నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి సంబంధిత అంశాలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంగికం, అభినయం, వాచకంల సమ్మేళనమే కళ అని మంత్రి దుర్గేష్ అన్నారు. అందమైన రూపంతో పాటు మంచి కంఠస్వరం, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేదే కళ అని అభివర్ణించారు. అంతరించిపోతున్న కళను, కళాకారులను గౌరవించడంతో పాటు మానవ జీవితాల్లో కళ ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని వెల్లడించారు. సుస్థిరమైన సమాజ నిర్మాణం కోసం సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వ సమ్మేళనాలు, కళాత్మకమైన ఉత్సవాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలుపుతూ కళల విలువ నేటి యువత తెలుసుకోవాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కళలకు ప్రాధాన్యతనివ్వలేదని, కళారంగాన్ని పట్టించుకోలేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వంలో కళలకు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి పెద్దపీట వేస్తున్నామని,కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేకంగా ఇచ్చే పెన్షన్ ను అందరితో పాటు ఇచ్చే పెన్షన్లలో కలిపారని ఓ కళాకారుడి ఆవేదనను మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. కళాకారులకు డబ్బు ముఖ్యం కాదని కానీ కళాకారులు అన్న పేరుతోనే పెన్షన్ ఇస్తేనే తమకు ఆత్మగౌరవంగా ఉంటుందని చెప్పిన మాటలను తాను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్ది అతి త్వరలోనే కళాకారుల పేరుతోనే గౌరవ వేతనంగా అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కళలకు కాణాచి అయిన ఉత్తరాంధ్ర

రాష్ట్రంలోని కళాకారులకు, కళారంగానికి పూర్తిగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. కళలకు పట్ల కూటమి ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉందన్నారు. కళలకు జీవం పోసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కళాకారులను అవార్డులతో సత్కరిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ప్రతి సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏపీకి కేటాయించాలని విజ్ఞప్తి చేయగా అందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వచ్చి తీరుతుందన్నారు. ఎంతో మంది లబ్ధ ప్రతిష్టులను తయారు చేసిన సంస్థగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన నటుడు నజీరుద్దీన్ షా వచ్చారని గుర్తుచేశారు. కళలకు కాణాచి అయిన ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళల ద్వారా ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రాంతంగా అభివర్ణించారు.ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్థానిక మాండలికంతో పాడే పాటలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా జనపదమే జానపదమని నమ్మి ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి జనాలను ఉర్రూతలూగించిన విప్లవకవి వంగపండు ప్రసాదరావు పాటలను ఉదహరించారు.

కళాకారులకు బాసట

కళాకారులను పోషించాలి.. వారికి బాసటగా నిలబడాలన్న ఆలోచనతో కళాకారులకు ఒక రోజు ముందుగానే దీపావళి తీసుకొచ్చిన రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళిని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు.కళారంగానికి ఇతోధికమైన సేవలు అందించండంతో పాటు కళాక్షేత్రానికి స్థలంతో పాటు కళాక్షేత్రం నిర్మించిన నాటక రంగ కళాకారుడు, పద్మనాటక పద్మశ్రీ యడ్ల గోపాలరావు కృషిని కొనియాడారు.చాలా మంది కళాకారులకు జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం మంచి వేదిక అవుతుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కళలను పోషించాలన్న ఉద్దేశంతో 7 రోజుల పాటు ఈ కళాక్షేత్రంలో వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. నిరంతరం కళా ప్రక్రియలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాటకాలను ప్రజలందరికీ తెలియజేయాలని ఈ క్రమంలో ఏపీ సాంస్కృతిక శాఖ తరపున అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం లో కేవలం నటనలు ప్రదర్శించడమే కాకుండా ఔత్సాహిక కళాకారులకు జానపద కళలు, కూచిపూడి నృత్యాల్లో తర్ఫీదు అందించేందుకు నటనా శిక్షణాలయం కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచానికి తెలుగు జాతి గొప్పతనాన్ని తెలిపేందుకు నూతనంగా వచ్చే కళాకారులను సమగ్రమైన కళాకారులుగా తీర్చిదిద్దాలన్న నిర్ణయం గర్వించదగినది అన్నారు.

నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ కళ్యాణ్

ఏపీలో కళలకు పుట్టినిల్లు ఉత్తరాంధ్రతో పాటు రాజమహేంద్రవరం అని మంత్రి దుర్గేష్ తెలిపారు. కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోని నాయకులు మీరైతే, నవతరం నాయకుడు, స్వయాన కళాకారుడు అయిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోని సభ్యుడిని తానని చమత్కరించారు. కూటమి పాలనలో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు.కళాకారులను పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. అందుకు అవసరమైన చర్యలు తాను తీసుకుంటానన్నారు. ఉత్తరాంధ్ర కళాకారులకు ప్రత్యేక స్థానం ఉందని, వాటిని గౌరవించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, స్థానిక జనసేన పార్టీ ఇంచార్జ్ పొగిరి సురేశ్, జిల్లా కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ,ఏఎంసీ ఛైర్మన్ బుర్రా నారాయణరావు, నాటక రంగ కళాకారుడు, పద్మనాటక పద్మశ్రీ యడ్ల గోపాలరావు, కూటమి నాయకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

కళలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వం బాధ్యత - Tholi Paluku