

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసిందని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. పేదల సంక్షేమాన్ని విస్మరిస్తూ కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ పథకాలను పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
