
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని తెలిపారు. పథకాలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో డబ్ల్యూ.పీ.నం.21732/2026 దాఖలైందని తెలిపారు. ఈ కేసులో ఆగస్టు 12న హైకోర్టు సెప్టెంబర్ 9 వరకు మధ్యంతర స్టే ఇచ్చిందని, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. అదే సమయంలో పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. స్టేపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ తప్పిదాల వల్లే
పథకాల్లో ఏవైనా లోపాలు ఉంటే అవి గత ప్రభుత్వం 2014లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని లోపాల వల్లే తలెత్తాయని వివరించారు. గత ప్రభుత్వం లోపభూయిష్టంగా జీవోలు జారీ చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, న్యాయపరమైన అంశాలపై కౌంటర్ దాఖలు చేయడంలో అధికారుల లోపమా, ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగంలో లోపమా అన్నదానిపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మేం కొనసాగిస్తాం
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ కార్యక్రమాలని, పేదింటి ఆడబిడ్డ వివాహ సమయంలో కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే వీటి ఉద్దేశమన్నారు. 2014లో ప్రారంభమైన ఈ పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించారని, రాజకీయాలకు అతీతంగా పేదల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోందని వెల్లడించారు.
ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. పథకాల ప్రారంభం నుంచి ఎస్సీ సంక్షేమానికి రూ.2,734.81 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1,801.48 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.7,803.05 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.831.70 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,204.83 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ.16,375.87 కోట్లకు పైగా నిధులు వెచ్చించి 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించినట్లు వివరించారు.
ఈ పథకాలు ఏదైనా ప్రత్యేక చట్టం కింద రూపొందించినవి కావని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేనన్నారు. పథకాల కోసం కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని, ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్ తదితర నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతున్నాయన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్, వివాహం తదితర అంశాలపై నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని, వివాహ సమయానికి వధువు 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండటం తప్పనిసరని, ఆర్డీవో, ఎంఆర్వో స్థాయిలో అర్హతలను పరిశీలించే వెరిఫికేషన్ వ్యవస్థ ఉందని, ప్రజాధనాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవానికి విరుద్ధమని అన్నారు.
కాగ్ అంశాలు పరిశీలనలో ఉన్నాయి..
కాగ్ నివేదికలోని అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అవి పథకాలు చట్టవిరుద్ధమని తుది న్యాయ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు వివాహం సామాజిక, ఆర్థిక బాధ్యత అని, అప్పులు చేసి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వం అందించే సహాయం అవసరమన్నారు. ఈ పథకాలు సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమం వంటి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. గతంలో నిధుల విడుదలలో ఇబ్బందులు ఉండేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేసే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, నిధుల నిర్వహణలో ఏర్పడిన సమస్యల కారణంగా జాప్యం జరిగిందని ఆరోపించారు. పథకం గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్న కారణంతో నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
మరోవైపు, తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు మంత్రుల క్వార్టర్స్‌లో ప్రభుత్వ ప్రతినిధులను కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ఆటో ఛార్జీల పెంపుపై కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. 2012లో ఛార్జీలు పెరిగాయని, దాదాపు 14 ఏళ్లుగా పెంపు జరగలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటామని, అయితే ప్రయాణికులపై అదనపు భారం పడకుండా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ఉద్దేశం ఆర్టీసీకి లేదని, ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసే ఆలోచన లేదని తెలిపారు. ఆర్టీసీ, రైల్వే, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను సమన్వయం చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆటో కార్మికుల ఉపాధికి పూర్తి రక్షణ కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
