
కర్నూలు నర్సింగ్ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు: స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్
కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థినుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తమను కళాశాల యాజమాన్యం వేధిస్తోందని, ముఖ్యంగా రంజాన్ మాసంలో కనీస భోజన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ 'జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసింది. కళాశాలలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని మతపరమైన ఆంక్షలు విధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా రంజాన్ ఉపవాసం ఉండే విద్యార్థినులకు తెల్లవారుజామున (సహరీ), సాయంత్రం (ఇఫ్తార్) సమయాల్లో సరైన భోజనం అందించడం లేదని అసోసియేషన్ ఆరోపించింది. రాత్రి 10 గంటల తర్వాత బయటి నుంచి ఆహారం తెప్పించుకుంటే కాలేజీ గేటు వద్దే నిలిపివేస్తున్నారని దీనివల్ల విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా కొందరు సిబ్బంది తమను టెర్రరిస్టులు అంటూ అవమానకర పదజాలంతో దూషిస్తున్నారని, హిజాబ్ ధరించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా ఈ తీవ్రమైన ఆరోపణలపై కళాశాల ప్రిన్సిపాల్ శాంతి భవాని వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. కళాశాలలో ఎలాంటి వివక్ష లేదని విద్యార్థులందరినీ తాము సమానంగానే చూస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. రంజాన్ పాటిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా తెల్లవారుజామున 3 గంటలకే మెస్ తెరిచి ఉంచుతున్నామని వారికి నచ్చిన ఆహారం సిద్ధం చేసేందుకు మెస్ కాంట్రాక్టర్‌తో కూడా మాట్లాడామని తెలిపారు. విద్యార్థుల చదువుపైనే తమ దృష్టి ఉందని, వేధింపులు జరుగుతున్నాయన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
ఇక రాత్రిపూట ఆహార సరఫరాపై ఆంక్షల గురించి వివరిస్తూ బాలికల హాస్టల్ భద్రత దృష్ట్యా రాత్రి 9 గంటల తర్వాత బయటి వ్యక్తులను అనుమతించడం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో బయటి ఆహారం తిని విద్యార్థినులు అనారోగ్యం పాలైతే ఆ బాధ్యత యాజమాన్యంపై పడుతుందని అందుకే కొన్ని నియమాలు పెట్టామని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై సమయపరిమితితో కూడిన స్వతంత్ర విచారణ జరిపించాలని విద్యార్థుల మౌలిక హక్కులు, మత స్వేచ్ఛ మరియు గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జెకెఎస్ఏ కోరింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని వాస్తవాలను తెలుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
