
కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి వీడియో వైరల్
కర్ణాటక డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్) కే. రామచంద్రరావు మహిళలతో అనుచిత స్థితిలో ఉన్నట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది. ఈ వీడియోలు పూర్తిగా తప్పుడు, కల్పితమైనవని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై హోం మంత్రి జీ. పరమేశ్వరను కలవడానికి డీజీపీ ప్రయత్నించినప్పటికీ ఆ భేటీ జరగలేదు. వైరల్ అయిన వీడియోల్లో మహిళల దృశ్యాలు ఉన్న నేపథ్యంలో, కన్నడ టీవీ చానళ్లు ఆ దృశ్యాలను బ్లర్ చేసి ప్రసారం చేశాయి. ఈ డీజీపీ, ఇటీవల సంచలనంగా మారిన బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన హర్షవర్ధిని రాణ్యా అలియాస్ రాణ్యా రావుకు సవతి తండ్రి కావడం గమనార్హం. రాణ్యా రావు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంది.
ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈ విషయం ఉదయమే నా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరిపిస్తాం. నేరం చేసినట్లు తేలితే ఆయన ఎంత సీనియర్ అధికారైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పవు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. వీడియోలు వైరల్ కావడంతో రామచంద్రరావు హోం మంత్రి నివాసానికి వెళ్లినా సమావేశం జరగలేదు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది ఎలా, ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారో నాకు కూడా తెలియదు. ఈ రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఈ వీడియోల గురించి నాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇది పాత వీడియో అని మీడియా ప్రశ్నించగా పాతది అంటే… బెలగావిలో ఉన్నప్పుడు, దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అని అన్నారు. తదుపరి చర్యలపై ప్రశ్నించగా, తన న్యాయవాదితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. నేను పూర్తిగా షాక్ అయ్యాను. ఇవన్నీ అబద్ధాలు, కల్పితమైనవి. ఈ వీడియోలు నిజం కావని మరోసారి స్పష్టం చేశారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారు ఎంత సీనియర్ అయినా సరే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్. సురేష్ కుమార్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. యూనిఫాం ధరించి, తన కార్యాలయంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడటం పోలీసు శాఖకు మచ్చ తెచ్చింది. ఇది క్షమించరాని నేరమని అన్నారు. ఇంతకు ముందు బంగారు స్మగ్లింగ్ కేసులో కూడా ఈ అధికారి పేరు దుర్వినియోగం అయిందని, అప్పట్లో ప్రభుత్వమే ఆయనను తప్పనిసరి సెలవుపై పంపిందని సురేష్ కుమార్ ఆరోపించారు. సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లి ఈ వ్యవహారంపై డీజీపీ రామచంద్రరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
