
కరూర్ బాధితులకు టీవీకే రూ.20 లక్షల సాయం
సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు తమిళ వెట్రి కళగం (టీవీకే) రూ. 20 లక్షలను జమ చేసినట్లు పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మనం ఇప్పటికే సెప్టెంబర్ 28, 2025న రూ. 20 లక్షలను కుటుంబ సంక్షేమ నిధిగా బాధితులకు పరిహారంగా అందిస్తామని చెప్పాం. అక్టోబర్ 18, 2025న ఆర్టీజీఎస్ ద్వారా ఆయా కుటుంబాలకు చెందిన ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ చిన్న సాయాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే పార్టీ కార్యకర్తలు దీపావళి వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పండుగ తర్వాత బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది.
వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలను కలిసేటందుకు చట్టపరంగా అనుమతులు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో బాధితులతో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు త్వరలోనే కలుస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమయంలో కరూర్ తొక్కిసలాటలో మరణించినవారిని స్మరించుకుంటూ వారు మనతో లేకపోవడం చాలా బాధకరమైంది. ఎవరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో వారికి ఈ కష్ట సమయంలో మద్దతుగా నిలబడతాం. ఎల్లవేళలా వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ బాధాకర సమయంలో దేవుని కృపతో దాని నుంచి బయటపడాలని అన్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా తొక్కిసలాట బాధితులకు మొత్తం రూ. 4.87 కోట్లు పరిహారం అందించిందని సీఎం ఎంకే స్టాలిన్ శాసనసభలో ప్రకటించారు.
కరూర్ చేరుకున్న సీబీఐ
సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఈ విచారణను స్వతంత్రంగా, పక్షపాత రహితంగా నిర్వహించడానికి మార్గదర్శకత్వం చేస్తుంది. ఐపీఎస్ ప్రభీణ్ కుమార్ నేతృత్వంలో సీబీఐ బృందం కరూర్ చేరుకుంది. సిట్ కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించింది.