Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో 10 మంది మృతి!

కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో 10 మంది మృతి!

Shaik Mohammad Shaffee
1 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. కరాచీ నగరంలోని అమెరికా కాన్సులేట్‌ ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించడంతో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ధృవీకరణ కావడంతో, షియా సంస్థలు ఆదివారం అమెరికా రాయబార కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నిరసనకారులు కరాచీలోని మాయి కోలాచీ రోడ్డులో ఉన్న కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది.

సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ సుమయ్యా సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో చాలా మంది బుల్లెట్ గాయాలతో సివిల్ ఆసుపత్రికి తరలించబడ్డారు. దాదాపు 30 మంది గాయపడగా, వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తొలుత భాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. అయితే నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సింధ్ అంతర్గత వ్యవహారాల మంత్రి జియాఉల్ హసన్ లంగర్ స్పందిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన మంత్రి, నిరసనకారులపై అమెరికన్ మెరైన్లు కాల్పులు జరిపారన్న వార్తలను తోసిపుచ్చారు.

నిరసనకారులు ఎంతలా రెచ్చిపోయారంటే, స్వచ్ఛంద సంస్థల అంబులెన్సులను, సహాయక సిబ్బందిని కూడా వదలకుండా దాడులు చేశారని ఎదీ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి ఫైసల్ ఎదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాన్సులేట్‌కు వెళ్లే దారులన్నింటినీ మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్‌లలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్లామాబాద్‌లోని 'రెడ్ జోన్' ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా సీల్ చేశారు. అక్కడ 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించిన యంత్రాంగం, నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లాహోర్ ప్రెస్ క్లబ్ వద్ద కూడా ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగాయి.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌లోని అమెరికా ఎంబసీ తన పౌరులకు కీలక సూచనలు చేసింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున అమెరికన్లందరూ అప్రమత్తంగా ఉండాలని, జనసమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. కాగా, 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణం దశాబ్ద కాలంలో ఇరాన్‌పై జరిగిన అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో 10 మంది మృతి! - Tholi Paluku