Let's talk: editor@tmv.in
కమలాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కమలాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన 394 డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమలాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.20 కోట్లతో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

ఇటీవల కమలాపూర్‌కు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తూ వారంలోగా లబ్ధిదారుల జాబితా ప్రకటించి ప్రొసీడింగ్స్ అందజేస్తామని హామీ ఇచ్చారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. అయితే పది రోజులు గడిచినా జాబితా విడుదల చేయకపోవడం, ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఇళ్లకు రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు ఇంకా పూర్తికాలేదని, కొన్ని ఇళ్లలో అద్దాలు పగిలిపోవడంతో పాటు బాత్రూమ్‌లు, తలుపులు కూడా సరిగా లేవని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులను ఇళ్లలోకి పంపడం సరికాదని పేర్కొన్నారు. కమలాపూర్‌తో పాటు గూడూరు, మరిపల్లిగూడెంలోనూ మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆడియోలు కూడా వెలువడుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కమలాపూర్‌లోని 394, గూడూరులోని 50, మరిపల్లిగూడెంలోని ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను వెంటనే ప్రకటించి, ప్రొసీడింగ్స్ అందజేయడంతో పాటు మౌలిక వసతులు పూర్తి చేసి ఇళ్లను అప్పగించాలని కోరారు. లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

కమలాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి - Tholi Paluku